Nara Lokesh Slam Ysrcp Government on Ganza Issue: వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. సర్కారు పాపాలు.. పాఠశాల విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయని అన్నారు. పాఠశాలల్లో గంజాయి, మద్యం, అసాంఘిక కార్యకలాపాలు పెరిగాయని ఆరోపించారు. విద్యార్థి దశలోనే పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజలారా కలిసి రండి.. మహమ్మారిపై యుద్ధం చేద్దాం’ అని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
ఆయన ఏమన్నారంటే.?
‘వైసీపీ (Ysrcp) పాలనలో బడి, గుడిలోకి గంజాయి వచ్చేసింది. విద్యార్థులు మద్యం మత్తులో బడికొస్తున్నారు. సీఎం జగన్ (CM Jagan) ఇంటి ఎదురుగా గంజాయికి బానిసైన పిల్లాడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తే పోలీసులు బలవంతంగా నోరు మూయించారు. సీఎం ఇంటి సమీపంలో డ్రగ్స్ మత్తులో గ్యాంగ్ రేప్ జరిగితే నేటికీ నిందితున్ని పట్టుకోలేదు. సీఎం ఇంటికి దగ్గరలో మద్యం మత్తులో ఉన్మాది.. అంధురాలిని హత్యచేస్తే చర్యల్లేవు. చంద్రగిరిలో 9వ తరగతి అమ్మాయి గంజాయికి బానిసైంది. చోడవరంలో ఏడో తరగతి విద్యార్థులు స్కూలులో మద్యం తాగారు. వీడియో తీసిన వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. విచ్చలవిడి గంజాయి, డ్రగ్స్, మద్యం విషాదాలు చూసి ఆవేదనతో కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరాను, లేఖలు రాశాను. కనీస చర్యలు తీసుకుపోగా.. టీడీపీ కార్యాలయంపైనే దాడులు చేశారు. పిల్లలు, యువత బంగారు భవిష్యత్తు నాశనం కావడం చూసి ఆందోళనతో ప్రధానికి లేఖ రాశాను. కేంద్రానికి వినతులు పంపాను. గవర్నర్‌ని కలిసి వివరించాను. గంజాయి, మద్యం, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాల నుంచి పిల్లల్ని కాపాడే వరకూ పోరాడుతూనే ఉంటా. దండుపాళ్యం వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఈ మహమ్మారిపై ప్రతిపక్షంగా ఉంటూనే రాజీ లేని పోరాటం చేస్తున్నాం. టీడీపీ - జనసేన ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ రహిత ఏపీ కోసం మనమంతా కలిసి యుద్ధం చేద్దాం’ అని పిలుపునిచ్చారు.
అనంతపురం ఘటనపై
అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తిని పోలీసులు నగ్నంగా ఊరేగించిన ఘటనపై లోకేశ్ స్పందించారు. వైసీపీ ఆదేశాలతో కొందరు పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుతో ప్రజాస్వామ్యం సిగ్గు పడుతోందన్నారు. 'రాక్షస రాజులు కూడా సైకో జగన్‌లాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడలేదు. అనంత జిల్లా విడపనకల్లు మండలం చీకులగురిలో వైసీపీ జెండాను కాల్చేశారనే ఆరోపణలపై టీడీపీ కార్యకర్త బీసీ బోయ సామాజికవర్గానికి చెందిన చంద్రమోహన్ ని అరెస్టు చేసిన పోలీసులు, నగ్నంగా కొడుతూ ఊరేగించిన ఘోరం చూశాక నా గుండె చెదిరిపోయింది. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన మీరు ప్రజాధనం జీతంగా తీసుకునే పోలీసులా ? లేక జగన్ కిరాయి సైన్యమా?. పార్టీ జెండా అంత పవిత్రమైనదా! జాతీయ జెండా పెడతామనడం నేరమా? మా టీడీపీ సైనికుడిని నగ్నంగా ఊరేగించారు, పక్కటెముకలు విరగ్గొట్టారు. మీరు చేసిన చర్యలకు చట్టబద్ధమైన శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉండండి.' అంటూ ట్వీట్ చేశారు.
Also Read: Hindupuram YSRCP : హిందూపురం టార్గెట్‌గా మంత్రి పెద్దిరెడ్డి రాజకీయాలు - వారం రోజులు అక్కడే మకాం !