Nara Lokesh on SSC Revaluation:  పదో తరగతి రీ వాల్యుయేషన్‌లో కొందరి విద్యార్థుల మార్కులు తేడాగా రావడంతో వైఎస్సార్సీపీ రెండు రోజులుగా ఆరోపణలు చేస్తోంది. పదోతరగతి మూల్యాంకనం సరిగ్గా జరగలేదని.. జవాబు పత్రాల వాల్యూయేషన్ తప్పుల తడకగా ఉందని తప్పు పడుతున్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా హ్యాండిళ్లలో ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్‌ చేస్తూ… చాలా ప్రచారం చేస్తున్నారు. దీనిపై లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పదో తరగతి పరీక్షా ఫలితాలపై వివరణ ఇస్తూనే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మోహనరెడ్డి హయాంలో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆరోపనలు చేయడమే కాదు.. జగన్‌పై పర్సనల్ అటాక్ చేశారు.

పదోతరగతి పేపర్లు ఎత్తుకెళ్లినవాడివి నువ్వు

వైఎస్ జగన్ పదోతరగతి పరీక్ష పేపర్లను ఎత్తుకెళ్లారంటూ.. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ చదువుకునే రోజుల్లో పదో తరగతి ప్రశ్నా పత్రాలు తీసుకెళ్లారని పలువురు టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో ఆరోపణలు చేశారు. వాటిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ 2024-25 పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ వైఎస్సార్సీపీ ఆరోపణలు చేస్తోంది.  రీ వెరిఫికేషన్‌లో కొంతమంది విద్యార్థులకు మార్కులు పెరగడంతో పరీక్షా పత్రాల మూల్యాంకన తప్పుల తడకగా జరిగిందని ఆరోపణలు చేశారు. దీనిపై కౌంటర్ ఇచ్చిన లోకేష్.. జగన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. X లో భారీ నోట్‌ పెట్టిన ఆయన జగన్‌ ను ఉద్దేశించి.. “ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే!” అన్నారు.

జగన్ నిర్ణయాలతో 12లక్షల మంది ప్రైవేట్ స్కూళ్లకు యూనిఫామ్ దగ్గర నుండి చిక్కీ వరకూ పార్టీ రంగులు, మీ పేరు పెట్టుకొని ఇప్పుడు విలువలు మాట్లాడుతున్నారా అని లోకేష్ ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఇచ్చే టెక్స్ట్ బుక్స్ రద్దు చేసిన మీరూ మాట్లాడటమేనా? అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు కాపలా పెట్టింది నిజం కాదా అని నిలదీశారు.

జి.ఓ 117, ఇతర అసంబద్ధ నిర్ణయాల వలన జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టారన్నారు.  ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చెయ్యకుండానే వెయ్యి పాఠశాలల్లో సిబిఎస్ఈ పరీక్షా విధానాన్ని తీసుకొచ్చారని.. అదే విధానంలో జరిగిన ఇంటర్నల్ పరీక్షలో 90శాతం మంది ఫెయిల్ అయ్యారని .. దానిని కొనసాగిస్తే.. చాలా మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం అయ్యేదన్నారు. పదోతరగతి ఫెయిల్ అయితే ఆడపిల్లలకు పెళ్లి చేస్తారని.. ఆ ఉద్దేశ్యంతోనే CBSE విధానాన్ని వాయిదా వేశామన్నారు. జగన్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన .4500 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, గుడ్ల దగ్గర నుండి చిక్కీల వరకూ  ఇవ్వాల్సిన 1000 కోట్లను తాము నెమ్మదిగా తీరుస్తున్నామన్నారు.

పదోతరగతి వాల్యుయేషన్‌లో తప్పులు లేవు

పదోతరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు భావించినప్పుడు రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోరడం ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియేనని లోకేష్ వివరణ ఇచ్చారు.  ఈ ఏడాది 45,96,527 లక్షల విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తే.. . రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ తరువాత 11,175 జవాబు పత్రాలను సరిచేశారని..మానవ తప్పిదం 0.25 శాతం మాత్రమేనని చెప్పారు  ప్రతి ఏడాది లాగే  ఈ ఏడాది కూడా 34,709 మంది విద్యార్థులు 66,363 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని..అందులో 10,159 మంది విద్యార్థుల 11,175 స్క్రిప్టుల (16.8శాతం) వ్యత్యాసాలను గుర్తించి, సరిచేయడం జరిగిందని.. బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నాం.. అని లోకేష్ చెప్పారు.  జగన్ రెడ్డి గారి జమానాలో 2022లో 41,694 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. అందులో 8,235 స్క్రిప్టుల (20 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. 2023లో 10,987 స్క్రిప్టుల (18 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. 2024లో 55,930 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 9,231 స్క్రిప్టుల (17 శాతం) వ్యత్యాసాలను గుర్తించారని చెప్పారు.

“ఇక పరీక్షల నిర్వహణ సరిగా లేదని, పేపర్లు లీకయ్యాయని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. గ్రూప్ - 1 లాంటి కీలకమైన ప్రశ్నపత్రాలను హాయ్ ల్యాండ్ లాంటి ప్రైవేటు రిసార్ట్‌లో వాచ్ మెన్లతో దిద్దించింది మీరు కాదా? ధనదాహంతో లక్షలాది మంది యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడింది మీరు కాదా?”  అని లోకేష్ ప్రశ్నించారు. రీ వెరిఫికేషన్లో తేడాలు గుర్తించిన విద్యార్థులకు అర్జేయుకేటీల్లో అడ్మిషన్లకు జూన్ 10వరకు అవకాశం ఇచ్చామని. ఇతర అడ్మిషన్ల విషయంలో కూడా సమయం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.