Nara Bramhani :  చంద్రబాబునాయుడు అరెస్టుతో ఆగిన యువగళం పాదయాత్ర ను నారా బ్రాహ్మణి కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంపై నారా లోకేష్ పార్టీ నేతలకు సంకేతం ఇచ్చారు. అవసరం అయితే నారా బ్రహ్మణి పాదయాత్ర కొనసాగిస్తారని చెప్పినట్లుగా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. 


 చంద్రబాబు నే కాదు... లోకేశ్‌నూ జైలుకు పంపిస్తామని  వైసీపీ నేతల తరచూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీఐడీ చీఫ్ సంజయ్ కూడా అదే చెబుతున్నారు. నారా లోకేష్ పై కూడా విచారణ చేస్తున్నామని ఆయనూ అరెస్టు చేస్తామన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నరు. అదే సమయంలో చంద్రబాబుపై వరుసగా గతంలో పెట్టిన కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేస్తున్నారు. ఎన్నికల దాకా రిమాండులోనే ఉంచాలనే వ్యూహం రచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.  అధినేత, ఆయన కుమారుడు ఇద్దరూ అరెస్టయితే ఎన్నికల సమయంలో  ఏం చేయాలన్న దానిపై  తెలుగుదేశం పార్టీ ‘ప్లాన్‌-బీ’ సిద్ధం చేసుకుంది.                      


 బ్రాహ్మణి   రంగంలోకి దిగి పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా వచ్చే వారంలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. చంద్రబాబు రిమాండ్ ప్రక్రియను.. పొడిగించి.. నారా లోకేష్ ను అరెస్టు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.  చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ, రకరకాల కేసులను తెరపైకి తెచ్చి వీలైనన్ని రోజులు ఆయనను జైలులో ఉంచాలన్నదే వైసీపీ పెద్దల వ్యూహం.అంటున్నారు. 


ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌తో లోకేశ్‌కు ఎలాంటి సంబంధంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  చంద్రబాబుతోపాటు లోకేశ్‌నూ అరెస్టు చేసి... దీర్ఘకాలం రిమాండులో ఉంచాలన్న వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తే దానిని దీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ ‘ప్లాన్‌-బీ’ సిద్ధం చేసుకుంది. నారా బ్రాహ్మణి సారథ్యంలో ముందుకు వెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటిదాకా చంద్రబాబు కుటుంబంలో మహిళలెవరూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. భువనేశ్వరి, బ్రాహ్మణి హెరిటేజ్‌ కంపెనీ వ్యవహారాలు, ఎన్టీఆర్‌ ట్రస్టు కార్యక్రమాల గురించి మాత్రమే మీడియాతో మాట్లాడారు. భువనేశ్వరి మీద అప్పట్లో వికృతమైన ప్రచారం జరిగినప్పుడు కూడా సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడమే తప్ప అంతకుమించి ఎక్కువగా స్పందించలేదు.                              


చంద్రబాబు అరెస్టు తర్వాతే భువనేశ్వరి మీడియా ముందుకు వచ్చారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ నిరసన ర్యాలీల్లో కూడా పాల్గొన్నారు.  రాజమండ్రిలో బ్రాహ్మణి మాట్లాడిన తీరు చూసిన తర్వాత... ఆమె సామర్థ్యంపై పార్టీ శ్రేణులకూ నమ్మకం ఏర్పడిందని చెబుతున్నారు.  చంద్రబాబు, లోకేశ్‌లిద్దరినీ ఒకే సమయంలో అరెస్టు చేసిన పక్షంలో బ్రాహ్మణి పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోకేష్ ఆపేసిన దగ్గర్నుంచి పాదయాత్ర నిర్వహించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాల్లో ప్రాచరం  జరుగుతోంది.