Nagababu:  ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం జరగబోతోంది.. అద్భుతం జరిగేటప్పుడు అందరూ సహకరించాలని జనసేన నేతలకు నాగేంద్రబాబు పిలుపునిచ్చారు.  పవన్ కల్యాణ్‌ కోసం నేను ఏమి చేయడానికి అయినా రెడీ అని ప్రకటించారు.  జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు.  అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ జనసేన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.  వైఎస్‌ జగన్, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్ర జాతికి ప్రమాదకరం అన్నారు. కరోనా వైరస్ తరువాత ప్రమాదకర వైరస్ వైసీపీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వైరస్ కు జనసేన, టీడీపీయే అసలైన మందుగా అభివర్ణించారు.
 
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు తప్ప.. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని దుయ్యబట్టారు నాగబాబు.. భూ కబ్జాల కోసం రాజధాని అన్నారా..!? అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అద్భుతం జరిగేటప్పుడు అందరూ సహకరించాలి. పవన్ కోసం నేను ఏమి చేయడానికి అయినా రెడీ అని వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌ కు ఓటు వేసే ముందు మమ్మల్ని చూసి కాకుండా.. భావితరాల భవిష్యత్ ను, మీ బిడ్డలను చూసి ఓటేయ్యండి అని పిలుపునిచ్చారు. అధికార, అహంకారంతో ఉన్న వైసీపీని గద్దె దించాల్సిందే అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌నే అక్కడ ప్రజలు ఓడించారు.. అలాంటిది ఎటువంటి అభివృద్ధి చేయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తారా? అని ప్రశ్నించారు.                              


నాగేంద్రబాబు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి  పోటీ చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం స్థానాలను జనసేనకు కేటాయించారన్న ప్రచారం జరుగుతోంది.  ఆ స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరికి మచిలీపట్నం, సాన సతీష్ కుమార్ కు కాకినాడ ఇస్తారని చెబుతున్నారు.  ఇప్పుడు అనకాపల్లి కూడా కావాలని పవన్ అడుగుతున్నట్లుగా చెబుతున్నారు. అనకాపల్లి స్థానం కోసం టీడీపీలోనే చాలా పోటీ ఉంది. బైరి దిలీప్ చక్రవర్తి అనే నేతకు చంద్రబాబు సీటు కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. కానీ చింతకాలయ విజయ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.          


ఇప్పుడు నాగబాబు రంగంలోకి వస్తున్నారు. దీంతో అనకాపల్లి వ్యవహారం హాట్ హాట్ గా మారే అవకాశం కనిపిస్తోంది. నాగబాబు గతంలో నర్సాపురం నుంచి నాగబాబు పోటీ చేశారు. నర్సాపురం పొత్తుల్లో ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ నుంచి రఘురామ పోటీ చేస్తారు. అందుకే అక్కడ చాన్స్ లేదు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి మాత్రం ఒక్క సారిగా ఎమ్మెల్యే గా గెలిచారు. మరో చోట ఓడిపోయారు. అల్లు అరవింద్  , పవన్, నాగబాబు ఇలా పోటీ చేసిన వారందరూ ఓడిపోయారు.  ఎవరు పోటీ చేసినా గెలవడం లేదు. ఈ సారి పవన్ తో పాటు నాగబాబు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.