వైఎస్ఆర్ సీపీ - జనసేన పార్టీల నాయకుల మధ్య విపరీతమైన స్థాయిలో వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకరిని మించి మరొకరు అంతకుమించిన అసభ్య పదజాలంతో దూషించుకుంటున్నారు. నిన్న (జనవరి 12) శ్రీకాకుళంలో జరిగిన యువశక్తి వివేకానంద వికాస వేదికపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత ఆజ్యం పోశాయి. ఇవాళ (జనవరి 13) పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వైఎస్ఆర్ సీపీ మంత్రులు, నేతలు మూకుమ్మడి మాటల దాడి చేశారు. అదే సమయంలో నాగబాబు మరింత ఘాటుగా ట్వీట్ వదిలారు.
వైఎస్ఆర్ సీపీ లీడర్లు మీడియా ముందుకు వచ్చి మొరగడం ప్రారంభించారని ట్వీట్ చేశారు. వారికి వాయినాలు ఇచ్చి పంపాలని ఎద్దేవా చేశారు. ‘‘వైసీపీ మగ ముత్తైదువలు మీడియా ముందుకొచ్చి మొరగడం మొదలు పెట్టారు. వాయినాలు ఇచ్చి పంపండి!’’ అని ట్వీట్ చేశారు.
శ్రీకాకుళం సభలో పవన్ వ్యాఖ్యలు
శ్రీకాకుళంలో జరిగిన యువశక్తి వివేకానంద వికాస వేదికపై పవన్ కల్యాణ్ మంత్రులు, ముఖ్యమంత్రి లక్ష్యంగా తీవ్రంగా ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ‘‘మన ఐటీ మంత్రి నీచ్ కమీన్ కుత్తే.. అతని పేరేంటో నాకు తెలీదు. సలహాదారు సజ్జలవి అన్నీ సచ్చు సలహాలు. సలహాలిచ్చేవాడు సజ్జల అయితే రాష్ట్రం పూర్తిగా నాశనం అవుతుంది. ఇక మంత్రి అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అని, మంత్రి రోజాను డైమండ్ రాణి’’ అని కూడా సంబోధిస్తూ ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్ అని, దత్తపుత్రుడని మళ్లీ మళ్లీ అంటే జనాలు చెప్పుతో కొట్టడం ఖాయమని అన్నారు.
ఈ వ్యాఖ్యలతో నేడు ఉదయం నుంచి వైఎస్ఆర్ సీపీ నేతలు ట్విటర్ల వేదికగా, ప్రెస్ మీట్లు పెడుతూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు.