Har Ghar Tiranga : ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 13 నుండి 15 తేదీ వరకూ ఏపీ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఆగస్టు 13 నుండి 15 వరకూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటిపైన ప్రతి కార్యాలయం,ప్రతి భవనం పైన మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని చెప్పారు.ఇందుకు గాను కోటి 42 లక్షల జాతీయ జెండాలు అవసరం ఉంటుందని కేంద్రానికి తెలియజేయగా కేంద్రం నుండి 40 లక్షల వరకూ సరఫరా కానున్నాయన్నారు. 16 X 21 సైజు అంగుళాల పరిమాణంతో కూడిన మరో 30 లక్షలు జెండాలను మెప్మా, 10 లక్షల జెండాలను సెర్ప్ ఆధ్వర్యంలో సిద్ధం కానున్నాయని సమీర్ శర్మ ప్రకటించారు.
ఏపీ ప్రజలకు కోటి 42 లక్షల జెండాల పంపిణీ
అదే విధంగా అటవీ శాఖ ద్వారా 80 లక్షల జెండా కర్రలు రఫరా కానున్నాయని సిఎస్ చెప్పారు. ఇంకా అవసరమైన మువ్వన్నెల జెండాలను వివిధ స్వచ్ఛంద సంస్థలు, లయన్స్, రోటరీ క్లబ్, ఇతర సంఘాలా ద్వారా సమకూర్చుకునేందుకు వీలుగా ఆయా సంఘాలు, సంస్థలకు లేఖలు రాసి వారిని భాగస్వాములను చేసి కార్యక్రమం విజయవంతానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవను సిఎస్ ఆదేశించారు.అదే విధంగా పాఠశాలు, కళాశాలు, విశ్వవిద్యాలయాలు, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్ధులను ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పెద్దఎత్తున భాగస్వాములను చేసి విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆగస్టు ఒకటో తేదీ నుంచి అవగాహనా కార్యక్రమాలు !
హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా ఆగస్టు 1నుండి 15 వరకూ రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఆగస్టు 1న అన్ని గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో ప్రజలకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా ఆగస్టు 2న త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. 3వ తేదీన స్వాతంత్ర్య సమరయోధులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సెమినార్లు,4వతేదీన పాఠశాలల,కళాశాలల,విశ్వ విద్యాలయాల విద్యార్ధినీ విద్యార్ధులకు దేశభక్తి గేయాలపై పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు.ఆగస్టు 5వతేదీన రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ,విశాఖపట్నం,తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో దశభక్తి పూరిత డ్రామ,ఏకపాత్రాభినయాలను నిర్వహించనున్నారు.
మూడు కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన
ఆగస్టు 11వతేదీన హెరిటేజ్ వాక్ ను,12వ తేదీన వివిధ క్రీడా పోటీలను,13వ తేదీన జాతీయ జెండాతో సెల్పీ(To be pinned in https://harghartiranga. com)కార్యక్రమంతో పాటు విజయవాడలో చిన్నారులు,కళాకారులు,ప్రజలతో కలిసి 3 కి.మీల పొడవున జాతీయ జెండా ప్రదర్శన జరుగుతుంది. ఆగస్టు 14వతేదీన స్వాతంత్ర్య సమరయోధుల ఇంటికి నడక కార్యక్రమం,స్వాతంత్ర్య సమరయోధులు వారి కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని, ఆగస్టు 15వతేదీన జాతీయ జెండా ఆవిష్కరణ పాదయాత్రలు మరియు ప్లాగ్ మార్చ్ లను వంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ సిఎస్ సమీర్ శర్మకు వివరించారు.