Mudragada Padmanabham Cancer: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమార్తె ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్ ఉందని కానీ చికిత్స చేయించడం లేదని.. ఆయనను ఓ చోట బంధించి ఎవరినీ కలవనివ్వకుండా, సంప్రదించనివ్వకుండా చేస్తున్నారని ముద్రగడ కుమార్తె క్రాంతి ఆరోపించారు.
తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారని.. తన సోదరుడు గిరి సరైన చికిత్సను చేయించడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. ఓ మాజీ YSRCP ఎమ్మెల్యే తనను తండ్రిని కలవడానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని కానీ తన సోదరుడు గిరి , అతని మామ అనుమతించలేదన్నారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. తమ దగ్గరి బంధువులకు, ముద్రగడ సన్నిహితులకూ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని క్రాంతి చెబుతున్నారు. గిరి, అతని బంధువుల ముద్రగడను బంధించి, ఒంటరిగా ఉంచుతున్నారని తెలిసిందని.. ఎవరూ ముద్రగడను సంప్రదించడానికి, మాట్లాడటానికి అనుమతించడం లేదని ట్వీట్‌లో తెలిపారు. రాజకీయ కారణాల కోసం ఇలా చేస్తున్నట్లయితే వదిలిపెట్టననని సోదరుడు గిరికి క్రాంతి హెచ్చరించారు.
ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన సమయంలో క్రాంతి వెలుగులోకి వచ్చారు. తన తండ్రితో విబేధించారు. జనసేన పార్టీలో చేరారు. అప్పట్లో ముద్రగడ కూడా పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్లిపోయినందున ఆమెతో సంబంధం లేదన్నట్లుగా చేశారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు లేనట్లుగా చెబుతున్నారు. అయితే రాజకీయ సంబంధాలు వేరు.. మానవ సంబంధాలు వేరని.. రాజకీయంగా వేర్వేరు దారుల్లో ఉన్నంత మాత్రాన కుటుంబాన్ని కూడా చీల్చుకోవాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది.
ఇటీవల వెన్నుపోటు దినంలో చాలా మంది పాల్గొన్నారని అందరికీ ధ్యాంక్స్ చెబుతూ ముద్రగడ పేరుతో లేఖ బయటకు వచ్చింది. అనారోగ్యం వల్ల తాను పాల్గొనలేకపోయానని అందులో ముద్రగడ పేర్కొన్నారు. . ప్రస్తుతం ముద్రగడ వ్యవహారాలన్నీ వైసీపీ నేత ఆయన కుమారుడు గిరి చూసుకుంటున్నారు. ఆయన ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభరెడ్ిగా మార్చుకున్నారు. ఆయనకు క్యాన్సర్ సోకిందని.. సరైన వైద్యం ఇప్పించడం లేదని కుమార్తె ఆరోపించడం సంచలనంగా మారుతోంది.