MP Vijaya Saireddy: టీడీపీ హాయాంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హాయాంలో చంద్రబాబు బీసీల తోకల కత్తిరిస్తానంటూ అపహాస్యం చేసి, ఇప్పుడు బీసీల ఓట్లు కోసం రోడ్ల మీద తిరుగుతున్నాడని అన్నారు. రాష్ట్రంలో బీసీలు తెలుగు దేశం పార్టీని నమ్మే పరిస్థితి లేదని, చంద్రబాబు కోసం బలహీన వర్గాల వారు మరోసారి బలి పశువుల కాలేరని చెప్పారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కేవలం ఇద్దరు బీసీలనే రాజ్యసభకు పంపారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడేళ్లలోనే మొత్తం ఐదుగురు బీసీలను రాజ్యసభ సభ్యులు చేశారని వెల్లడించారు. పలు అంశాలపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆదివారం స్పందించారు.
రాష్ట్ర ప్రజలకు ఎవరిని నమ్మాలో, ఎందుకు నమ్మాలో, ఏ పార్టీకి ఓటు వేయాలో బాగా తెలుసన్నారు. టీడీపీ అనుకూల మీడియాలో రాతలు బాగానే ఉంటాయని, అయితే జన సునామీలో అవి కొట్టుకుపోతాయని 'జగన్నా'థ రథ చక్రాల కింద పడి నలిగిపోతాయని విజయ సాయిరెడ్డి తెలిపారు. చంద్రబాబుకు నిజంగానే ఇవి చివరి ఎన్నికలు అవుతాయని విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన కేవలం తన సామాజిక వర్గం, తన కుటుంబం కోసమే పనిచేశారని, ఏనాడూ బీసీల కోసం పాటు పడని నేతగా చంద్రబాబు మిగిలిపోతారన్నారు. 2024 ఎన్నికల తరువాత చంద్రబాబుతో పాటు టీడీపీ కూడా రాజకీయాల్లో ఉండదంటూ సెటైర్లు వేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రైవేట్ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. కానీ సీఎంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రం బీసీలకు ఏమీ చేయలేకపోయారని, ఇప్పుడు మాత్రం బీసీలకు పెద్ద దిక్కు అనేలా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు..
"నీకు చిప్ పూర్తిగా పాడైపోయింది చంద్రం! వైసీపీ వాళ్లు మెడ మీద కత్తిపెట్టి టీడీపీలో చేరమని బెదిరిస్తున్నారా? నిన్ను బాగు చేయడం ఎవరి తరం కాదు. అందరూ నీలాగే వేరే పార్టీ వాళ్లను కొనుగోలు చేయరు. నిన్ను ఇలాగే వదిలేస్తే జనానికి పిచ్చెక్కిస్తావ్." అంటూ విజయసాయిరెడ్డి కామెంట్లు చేశారు.