MP RRR Celebrate Sankranti Festival In Narsapuram :   రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసుల విషయంలో 41ఏ సెక్షన్ విధివిధానాలను తప్పనిసరిగా అనుసరించాలని, అరెస్ట్ నుంచి రఘురామకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఓ వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. వైఎస్ఆర్‌సీపీని ధిక్కరించిన తర్వాత రఘురామకృష్ణరాజుపై అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన ఏపీలో అడుగు  పెడితే అరెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారన్న అనుమానంతో ఆయన ఏపీకి రావడం లేదు.  ఈ క్రమమంలోసంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళుతున్నానని, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.                                                


తనపై ఇప్పటికే 11 కేసులు నమోదు చేశారని, మరో కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని రఘురామ నిన్న పిటిషన్ దాఖలు చేశారు. తనకు రక్షణ కల్పించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.  వాదనలు విన్న అనంతరం రఘురామకృష్ణరాజుకు ఊరట కలిగించే నిర్ణయం వెలువరించింది.   రఘురామను గతంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని, ఆయనను చిత్రహింసలు పెట్టారని రఘురామ తరపు న్యాయవాులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  మరో అక్రమ కేసుతో అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. సీఐడీ అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.                                     


రఘురామకృష్ణరాజు దాఖలు  చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.  ఓ కేసు నమోదయ్యాక, ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్నప్పుడే 41ఏ కింద నిబంధనలు వర్తిస్తాయని కోర్టుకు తెలిపారు. ఇప్పుడేమీ రఘురామపై కొత్త కేసులు నమోదు చేయలేదని వెల్లడించారు. ఏపీ సీఐడీ వ్యవహారశైలి ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శల పాలవుతోంది. 41ఏ నోటీసులు ఇవ్వడానికి కూడా అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్‌కు ప్రత్యేక వాహనాల్లో వచ్చి టీడీపీ నేతల్ని, సానుభూతి పరుల్ని అదుపులోకి తీసుకెళ్లి సీఐడీ ఆఫీస్‌కు తీసుకెళ్లి ఫోన్లు, పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుని నోటీసులు ఇచ్చి విడుదల చేస్తున్నారు. 


సీఐడీ బాధితులు అనేక మంది హైకోర్టును ఆశ్రయిస్తున్నాయి. సీఐడీ అన్ని రాజకీయ పరమైన కేసులే చూస్తోంది. ముఖ్యంగా  ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిని టార్గెట్ చేసుకుని మాత్రమే సీఐడీ పని చేస్తోంది. ఈ వ్యవహారంపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఎన్ని అరెస్టులు చేసినా ఒక్క కేసులోనూ చార్జిషీట్లు దాఖలు చేయడం లేదని.. తాత్కలికంగా వేధించడానికి తప్పుడు ప్రచారం చేయడానికే కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. మరో వైపు రఘురామ నాలుగేళ్ల తర్వాత నియోజవకర్గానికి వస్తూండటంతో బలప్రదర్శన చేస్తున్నారు.