Mp Raghurama Krishnam Raju Meet Amaravathi Farmers: రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి విజయం ఖాయమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) ధీమా వ్యక్తం చేశారు. తొలుత టీడీపీ - జనసేనకు 130 సీట్లు వస్తాయని అంచనా వేశానని.. అయితే బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవడంతో 135 సీట్ల కన్నా ఎక్కువ సాధిస్తామని జోస్యం చెప్పారు. సోమవారం ఆయన తుళ్లూరులోని (Tulluru) దీక్షా శిబిరానికి వెళ్లి రాజధాని రైతులు, మహిళలను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. జగన్ ప్రభుత్వ దాష్టీకానికి అనేక ఇబ్బందులు పడ్డానని.. అయినప్పటికీ పోరాటం ఆపలేదని అన్నారు. ప్రభుత్వం తనపై పెట్టిన కేసుల వల్లే రాష్ట్రంలోకి రాలేకపోయినట్లు వెల్లడించారు. తనను ఆంధ్రాలోకి అడుగు పెట్టకుండా వైసీపీ అరాచకం సృష్టించిందని మండిపడ్డారు. కేసులపై కోర్టుల్లో స్టేలు తెచ్చుకునేందుకు 2, 3 నెలల సమయం పట్టిందని.. అందుకే అమరావతి రాజధాని రైతులను ఇదివరకే కలవాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఇక్కడికి రాలేక ఢిల్లీలోనే సంఘీభావం తెలియజేశానన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. ఐదేళ్లు ఆలస్యమైనా అమరావతిని అనుకున్న దాని కంటే అద్భుత నగరంగా తీర్చిదిద్దగలుగుతారని ఎంపీ రఘురామ అన్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో కూటమి ఉమ్మడి మహా సభకు కచ్చితంగా హాజరవుతానని స్పష్టం చేశారు. వైసీపీ 'సిద్ధం' సభకు మీడియాను రావొద్దని చెప్పడంతోనే అవి గ్రాఫిక్స్ అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చేస్తుందని.. ఇక అందరూ స్వేచ్ఛగా ఎవరి భావాలు వారు వ్యక్తం చెయ్యొచ్చని చెప్పారు. అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో సుదీర్ఘ కాలం సాగిన పోరాటం అని.. త్వరలోనే రాజధాని రైతుల పోరాటం ఫలిస్తుందని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు, టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల విషయంపై ఆయా పార్టీల ముఖ్య నేతలు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీకి టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్, పార్టీ జాతీయ నేత బైజయంత్ పండా హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. పొత్తులో భాగంగా టీడీపీ 145 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగనుంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. వీటిలో జనసేన 6 అసెంబ్లీ సీట్ల అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 6 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతవారం ఢిల్లీలో పర్యటించారు. బీజేపీ పెద్దలతో, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఇరువురు నేతలు భేటీ అయిన తరువాత పొత్తులపై స్పష్టత ఇచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలో ఎన్డీఏలోకి వచ్చాయని.. ఏపీలో ఈ పార్టీలతో కలిసి బీజేపీ పనిచేయనుందని పార్టీ అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొనడం తెలిసిందే.
Also Read: Botsa Satyanarayana: ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలున్నాయా? 3 పార్టీల పొత్తులపై మంత్రి బొత్స సెటైర్లు