ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎయిడెడ్ కాలేజీల ఆస్తులను స్వాధీనం చేసుకుని తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ద్వారా కనీసం రూ. లక్ష కోట్లను సమీకరించుకోవాలని చూస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై విమర్శలు చేశారు. ప్రభుత్వం ఎయిడెడ్ కాలేజీలపై దృష్టి పెట్టిందని.. వాటిని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇటీవల ఏపీ సర్కార్ రాష్ట్రంలోని ఎయిడెడ్ కాలేజీల ఆస్తులతో సహా అప్పగించాలని ఆదేశించింది. ఒక వేళ అలా ఆప్పగించకపోతే... సిబ్బందిని మాత్రం పంపేయాలని సూచించింది. అంటే ఇక నుంచి ఆయా సంస్థలకు ప్రభుత్వం తరపున ఎటువంటి ఎయిడ్ ఉండదని అర్థం. ఏపీలో పెద్ద ఎత్తున ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్లకు ఆస్తులు ఉన్నాయి.


 వాటిని ప్రభుత్వానికి దఖలు పరిస్తే .. అమ్మడానికి లే ఔట్లు వేయడానికి కూడా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఈ అంశాలను దృష్టి లో పెట్టుకునే రఘురామకృష్ణరాజు  ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల గురించి ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఎన్ని కష్టాలున్నా ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగించవద్దని అలా చేస్తే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ పాడైపోతుందని  రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ స్కూళ్ల ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని ఎడ్యుకేషన్ కార్పొరేషన్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి.. మరికొన్ని వేల కోట్ల అప్పులకు వెళ్లబోతోందని...  ఈ అప్పులకు ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులనే్ తనఖాగా చూపిస్తారని రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. ఓ లక్ష కోట్ల రూపాయలు అలా సంపాదించుకుంటే.. ఓ ఏడాది గడిచిపోతుందన్న ఉద్దేశంలో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. ొఏపీ ప్రభుత్వానికి అప్పులు ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని.. నిబంధనలు ఉల్లంఘించి రుణాలు ఇస్తే.. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన బ్యాంకర్లను హెచ్చరించారు.   ఎంపీగా చెబుతున్నా.. బ్యాంకులు లిమిట్‌లో ఉంటూ నిబంధనలు పాటిస్తే మంచిదన్నారు.


వేమన పద్యం చదివి .. ఇప్పటికైనా ఉద్యోగులకు సక్రమంగా జీతాలివ్వాలని సెటైర్లు వేశారు.  జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ఆగస్టు 25 తర్వాత చూద్దామని ఏమైనా జరగొచ్చని రఘురామ వ్యాఖ్యానించారు.   బెయిల్ రద్దు పిటిషన్ వేశానని చాలా మంది తప్పుగా అర్ధం చేసుకున్నారన్ని.. తమ పార్టీ అధ్యక్షుడు కడిగిన ముత్యంలా బయటకు రావాలనే పిటిషన్ వేశానని చెప్పుకొచ్చారు.   రెండేళ్లుగా కోర్టుకు హాజరు కావడం లేదని.. సుప్రీం కోర్టు కూడా కేసుల్ని ఏడాదిలో తేల్చాలంటోందని ...గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయి ఓ నెల రోజులు జైలుకు వెళితే... ఆయన క్లీన్‌గా బయటకు వస్తారని అప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి కావొచ్చని సెటైర్లు వేశారు.