Lavu Sri Krishna Devarayalu Joins TDP in presence of Chandrababu: గురజాల: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు టీడీపీలోకి వచ్చారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. లావు శ్రీకృష్ణదేవరాయలుకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పారు. యువ ఎంపీని టీడీపీలోకి సాదర స్వాగతం పలికారు. భుజం తట్టి అభినందించారు. 


ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ... పల్నాడు ప్రాంతంలో వ్యవసాయ రంగానికి తోడ్పాటునందించే ప్రాజెక్టుల నిర్మాణంలో టీడీపీ కృషి చేస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. ఈ ఐదేళ్లలో తాను అధికంగా సమయం కేటాయించింది పల్నాడుకు చెందిన ప్రాజెక్టులు, ఇతర సమస్యలపైనే అని వెల్లడించారు. తాను ఏ వేదికపైనా ఎవరినీ అతిగా పొగిడింది లేదని, ఎవరినీ అనవసరంగా విమర్శించిందీ లేదన్నారు. ఇకపైనా పల్నాడు ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 


గత ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి నరసరావుపేట నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తుండడం తెలిసిందే.