Modi Pawan Chandrababu road show in Kurnool: ప్రధాని మోదీ అక్టోబర్ 16న ఏపీ పర్యటనకు రానున్నారు.   కర్నూలు-నంద్యాల జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అలాగే  GST సంస్కరణల ర్యాలీ, శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు కూటమి నేతలతో రోడ్ షో నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతో కలిసి ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమాలు ఖరారరయ్యాయి.                  

ప్రధాని మోదీ పర్యటన గురించి శాసనమండలి లాబీలో చెప్పిన లోకేష్                    

ప్రధాని మోదీ పర్యటన వివరాలను మంత్రి నారా లోకేష్ శనివారం శాసనమండలి లాబీలో సహచర మంత్రులు, ఎమ్మెల్సీలకు వివరించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ సమావేశంలో లోకేష్, "ప్రధాని మోదీ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి. GST సంస్కరణలు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రజలకు ప్రయోజనం చేకూర్చనున్నాయి" అని చెప్పారు. పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల అవుతుందని ఆయన తెలిపారు.     

కర్నూలులో ర్యాలీ తర్వాత శ్రీశైలం స్వామి వారిని దర్శించుకోనున్న ప్రధాని మోదీ                    

పర్యటనలో ముఖ్య ఆకర్షణ కర్నూలులో జరిగే GST సంస్కరణలపై భారీ ర్యాలీ ఉంటుంది.  ఇటీవల సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చిన 'నెక్స్ట్ జెన్ GST' సంస్కరణలను ప్రధాని మోదీ ప్రజల ముందుంచనున్నారు. ఈ సంస్కరణలు పన్నుల భారాన్ని తగ్గించి, పేదలు, మధ్యతరగతులకు 'సేవింగ్స్ ఫెస్టివల్'గా మారాయని మోదీ జాతికి ఉద్దేశించిన ప్రసంగంలో చెప్పారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లపై GST 5%కి తగ్గింపు , చిన్న కార్లపై 28% నుంచి 18%కి, మరిన్ని వస్తువులపై పన్ను తగ్గింపులు.. వంటి వాటితో ఇప్పటికే కొనుగోళలు పెరిగాయి.           

కూటమి బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ                      

ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు. NDA కూటమి ఐక్యతను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.  ర్యాలీలో లక్షలాది మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. మొత్తం విలువ రూ.10,000 కోట్లు మించవచ్చని అంచనా.                       

పవన్, చంద్రబాబు, లోకేష్ లు కూటమి ర్యాలీలో పాల్గొనే అవకాశం                 పర్యటనలో మరో ముఖ్య అంశం..ప్రధాని మోదీ శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం. ప్రధాని మోదీ కర్నూలు-నంద్యాల టూర్ ముగింపున శ్రీశైలం చేరుకుని స్వామి వారి దర్శనం చేసుకుంటారు.  పర్యటన ముగింపున కర్నూలులో NDA కూటమి నేతలతో రోడ్ షో జరుగనున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌  ప్రధాని మోదీతో కలిసి పాల్గొంటారు.