ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నేడు (మార్చి 13) ఉదయం 8 గంటలకే ప్రారంభం అయింది. మొత్తం 1,538 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. 


ఎమ్మెల్సీ ఎన్ని­కల కోసం మొత్తం 1,538 పోలింగ్‌ స్టేషన్లను సిద్ధం చేశారు. మూడు పట్టభద్రులు, రెండు టీచర్లు, మూడు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 10,59,420 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వాడుకోనున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 584 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఇక్కడ మైక్రో అబ్జర్వర్లతోపాటు బయట వీడియో గ్రాఫర్‌లను కూడా ఏర్పాటు చేశారు.


శ్రీకాకుళం లోకల్‌ అథారిటీ నుంచి ఇద్దరు, పశ్చిమ గోదావరిలో రెండు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు, కర్నూలులో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక పట్టభద్రుల నియోజకవర్గాల్లో శ్రీకాకుళం –విజయనగరం – విశాఖపట్నం నుంచి 37 మంది, ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు నుంచి 22, కడప – అనంతపురం – కర్నూలు నుంచి 49 మంది పోటీ పడుతున్నారు. ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు టీచర్ల నియోజకవర్గంలో 8 మంది, కడప – అనంతపురం – కర్నూలు టీచర్ల నియోజకవర్గం నుంచి 12 మంది పోటీలో ఉన్నారు. 


ఇక్కడ ఏకగ్రీవం
మొత్తం 9 స్థానిక సంస్థల అభ్యర్థులకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకాగా అందులో ఐదుచోట్ల కేవలం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో అనంతపురం లోకల్‌ అథారిటీ నుంచి ఎస్‌.మంగమ్మ, కడప పి. రామసుబ్బారెడ్డి, నెల్లూరు మేరిగ మురళీధర్, తూర్పుగోదావరి కుడుపూడి సూర్యనారాయణరావు, చిత్తూరు నుంచి సుబ్రమణ్యం సిపాయిల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. 


ఎన్నికల లెక్కింపు ఎప్పుడంటే
ఎనిమిదిచోట్ల స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను భద్రపర్చడానికి ఎనిమిది చోట్ల స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటుచేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. 40 టేబుల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఓట్ల లెక్కింపు వేరుగా ఉండడంతో దానికి తగ్గట్లుగా అధికారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఫలితాలు తెలిసేందుకు రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు.


టీడీపీ నేత అరెస్టు


తిరుపతిలోని సత్యనారాయణ పురం పోలింగ్ స్టేషన్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటు లేకున్నా వైసీపీ నాయకులను పోలింగ్ కేంద్రంలోకి పంపిస్తున్నారంటూ మబ్బు దేవనారాయణ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. దేవనారాయణ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించారు.


మరోవైపు, సదుంలో ఎమ్మెల్సీ ఓటు హక్కును ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వినియోగించుకున్నారు.


కడపలో వైఎస్ఆర్ సీపీ - టీడీపీ నాయకుల మధ్య వాగ్వివాదం


కడప నగరంలోని గాంధీ నగర్ పొలింగ్ స్టేషన్ లో 22వ బూత్‌లో వైఎస్ఆర్ సీపీ - టీడీపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ లో వాలంటీర్ విధులు నిర్వహిస్తున్నాడంటూ టీడీపీ ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. బయటకు పంపాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించి ఇరువురికి బయటకు పంపేశారు.