Vallabhaneni Vamsi :   మెడికల్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్  పేరు తీసేసినంత మాత్రాన ఆయనపై ప్రజల్లో అభిమానం తగ్గదని...  వైస్సార్ పేరు పెట్టడం ద్వారా కొత్తగా పుట్టుకొచ్చే అభిమానం ఏమీ ఉండదని టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. అనారోగ్యం కారణంగా చాలా కాలంగా బయట కనిపించని ఆయన గన్నవరంలో మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చినప్పుడు సోషల్ మీడియాలో ఈ నిర్ణయాన్ని సీఎం జగన్ పునంపరిశీలించాలని కోరుతూ పోస్టు పెట్టారు. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా బయటకు వచ్చి మాత్రం భిన్నంగా స్పందించారు. ఎన్టీఆర్ పేరు తీసేసినా.. ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదన్నట్లుగా చెప్పారు.  పేరు మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయం అని చెప్పుకొచ్చారు. 


అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆయన గతంలోలా విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమ లేదన్నారు. నిజంగా చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే.. గన్నవరం విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మారినప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టి ఉండేవారన్నారు. అలాగే భారతరత్నకు ప్రతిపాదించేవారన్నారు. ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేవారన్నారు. ఇవేమీ చేయలేదు కాబట్టి ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు ప్రేమ లేదని మండిపడ్డారు. ఒక ఇంట్లో 2 ఎలుకలు తిరుగుతుంటే ఇల్లు తగలెట్టేయండి అని సలహా ఇచ్చే వ్యక్తే చంద్రబాబ అని విమర్శలు గుప్పించారు. 


ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి .. ఎన్టీఆర్ పేరు తొలగొంచిన అంశంలో... జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపైనా వల్లభనేని వంశీ స్పందించారు. ఆ విమర్శలన్నీ తెలుగుదేశం పార్టీ నేతలే చేస్తున్నట్లుగా మాట్లాజారు.   జూనియర్ ఎన్టీఆర్ స్వయంకృషితో పైకి వచ్చాడన్నారు.   ఎవరి మీద ఆదారపడలేదు, అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయన్నారు. అయితే అవి కుటుంబ పరమైనా.. రాజకీయ పరమైనవా అన్నది వంశీ చెప్పలేదు. ఎన్టీఆర్ సూపర్ స్టార్‌గా ఎదుగడం వెనుక ఎవరి పాత్రా లేదని స్పష్టం చేశారు. సొంతంగా ఎదిగిన ఎన్టీఆర్‌ను.. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయించుకుని.. ఆ తర్వాత వదిలేశారన్నారు. ప్రతి సమస్యలో ఎన్టీఆర్ ను లాగడం మంచిది కాదని మీడియాకు సలహా ఇచ్చారు.  


అదే సమయంలో పవన్ కల్యాణ్‌పైనా వల్లభనేని వంశీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.   పవన్ కళ్యాణ్ అనే వాడు టీడీపీ అడిగినా అడగకపోయినా ప్రతి విషయానికి స్పందిస్తాడని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో అమరావతి అంశానికి మద్దతు తెలియచేయడం.. అలాగే  ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పుపైనా స్పందించారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని వల్లభనేని వంశీ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు పవన్ కల్యాణ్ ఏం విమర్శలు చేసినా..చంద్రబాబు కోసమే అలా చేశారని అంటూ ఉంటారు. ఇప్పుడు వంశీ కూడా అలాగే చేశారు. మొదట్లో సోషల్ మీడియాలో... ఆయన వ్యతిరేక కామెంట్ పెడితే.. అసంతృప్తి వ్యక్తం చేశారని అనుకున్నారు కానీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి భిన్నంగా మాట్లాడటం ఎన్టీఆర్ అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తోంది.