Andhra Politics : ఎమ్మెల్యే పిన్నెల్లి తనపై నమోదైన కేసుల్లో దర్యాప్తు అధికారుల్ని మార్చాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఐజీ సహా కొందరు పోలీస్ అధికారులు తమను టార్గెట్ చేసి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషన్ లో పేర్కొన్నారు. మాచర్లలో అల్లర్ల తర్వాత వైసీపీ క్యాడర్ పైనే కేసులు పెట్టారు తప్ప మా ఫిర్యాదులు పట్టించుకోవటం లేదని పిన్నెల్లి పిటిషన్ లో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 13, 14 తేదీల్లో అల్లర్లు జరిగితే 23వ తేదీన బెయిల్ వచ్చాక పోలీసులు కొత్త కేసులు పెట్టారని పిన్నెల్లి ఆరోపించారు. సదరు అధికారులపై చర్యలు తీసుకుని విచారణ అధికారులుగా వేరే వారిని నియమించాలని కోరారు.
ముందస్తు బెయిల్ పై ఉన్న పిన్నెల్లి
ప్రస్తుతం పిన్నెల్లి ముందస్తు బెయిల్ పొందారు. తనపై నమోదైన అన్ని కేసుల్లో షరతుల బెయి్ల పొందారు. నర్సరావుపేటలో ఉండి ప్రతి రోజూ పల్నాడు ఎస్పీ కార్యాలయంలో సంతకం పెడుతున్నారు. కోర్టు షరతుల మేరకు గురుజాల కోర్టు లో పాస్‌పోర్టు అప్పగించారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలో ఈవీఎంను ధ్వంసం కేసు, టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై హత్యాయత్నం, మహిళ నాగశిరోమణిపై దుర్భాషలాడడం, కారంపూడిలో అలర్లు, సీఐ నారాయణస్వామిపై దాడి ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పిన్నెల్లిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు .
పిన్నెల్లిపై పూర్తి స్థాయి నిఘా పెట్టిన ఈసీ
పిన్నెల్లి కదలికలపై పూర్తిస్థాయిలో ఈసీ పూర్తి నిఘా ఉంచింది. ఆయన కదలికలను అనుక్షణం గమనిస్తోంది. ఏ విధమైన నేరకార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని, నేర ఘటనలను పునరావృతం చేయవద్దని పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన కేవలం హోటల్‌కే పరిమితం అయ్యారు. నరసరావుపేట దాటొద్దని కోర్టు ఆంక్షలు విధించడంతో పిన్నెల్లి సొంత నియోజకవర్గానికి వెళ్లే పరిస్థితి కూడా లేకపోయింది. దీంతో అక్కడి వైసీపీ నేతలు నరసరావుపేట వచ్చి ఆయన్ను కలుస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్ల నియామకంపై చర్చిస్తన్నారు.
కోర్టు షరతుల మేరకు నర్సరావుపేటలో ఓ హోటల్‌లో ఉంటున్న పిన్నెల్లి
కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు తెలిపింది. జిల్లాలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించొద్దని పిన్నెల్లికి సూచించింది. అనుచరులను నియంత్రించే బాధ్యత పిన్నెల్లి తీసుకోవాలని తేల్చిచెప్పింది. కేసుల గురించి మీడియాతో మాట్లాడవద్దని, సాక్షులను ప్రభావితం చేయవద్దని సూచించింది. ఈ షరతుల కారణంగా పిన్నెల్లి మీడియాతో కూడా మాట్లాడటం లేదు.