Balakrishna Vs MLA Kamineni: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ హయాంలో సినీ పరిశ్రమకు జరిగిన వేధింపుల విషయంపై చర్చ జరిగింది. సినీ హీరోలు అందరూ గతంలో తాడేపల్లికి వచ్చి జగన్ ను కలిశారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలను బీజేపీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్ వివరించారు. చిరంజీవి నేతృత్వంలో హీరోలు అందరూ తాడేపల్లికి వచ్చినప్పుడు జగన్ సమావేశానికి రాలేదని...సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడాలని సూచించారు. దీనిపై చిరంజీవి తాను అందర్నీ తీసుకు వస్తే సీఎం రాకపోవడం ఏమిటని గట్టిగా నిలదీస్తే అప్పుడు వచ్చి మాట్లాడారని అన్నారు.
జగన్ ను చిరంజీవి గట్టిగా నిలదీశారన్న కామినేని
అయితే కామినేని మాటల్ని నందమూరి బాలకృష్ణ ఖండించారు. ఎవరూ గట్టిగా జగన్ ను నిలదీయలేదన్నారు. హీరోలు అందరూ వెళ్లిన సమయంలో.. ఆ సైకో సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలన్నారు. చిరంజీవిని అవమానించిన మాట నిజమేనన్నారు. అదే సమయంలో బాలకృష్ణ కూటమి ప్రభుత్వం తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఎఫ్‌డీసీ సమావేశంలో తన పేరును తొమ్మిదో స్థానంలో పెట్టారన్నారు. తాను ఈ విషయంపై వెంటనే కందుర దుర్గేష్‌తోనూ మాట్లాడానన్నారు.
ఎవరూ గట్టిగా నిలదీయలేదని చెప్పిన బాలకృష్ణ
చిరంజీవి .. జగన్ ను నిలదీశారని ఎమ్మెల్యే కామినేని చెప్పడం బాలకృష్ణకు నచ్చకపోవడంతో ఆయన మధ్యలో కల్పించుకుని దాన్ని ఖండించినట్లుగా తెలుస్తోంది. ఎవరూ నిలదీయలేదని బాలకృష్ణ చెప్పడం ద్వారా.. జగన్ ను గతంలో చిరంజీవి నిలదీశారన్న హీరోయిజాన్ని చిరంజీవి ఆపాదించడం.. బాలకృష్ణకు ఇష్టం లేకపోయిందని అందుకే ఆయన ఖండించారని అంటున్నారు. నిజానికి అలా వెళ్లిన హీరోల బృందంలో బాలకృష్ణ లేరు. అయినా అక్కడేం జరిగిందో ఇతర హీరోల ద్వారా లేదా.. ఇతర సోర్సుల ద్వారా తెలిసిందేమో కానీ.. కామినేని చెప్పినట్లుగా జరగలేదని ఖండించారు.
చిరంజీవిని జగన్ అవమానించిన మాట నిజమన్న బాలకృష్ణ
నిజానికి ఇది ఖండించాల్సినంత విషయం కాదు. నిజంగా అక్కడ అంత మంది హీరోలు వచ్చినప్పటికీ జగన్ కలవడానికి ఇష్టపడకపోవడం.. ఆహ్వానించి.. అపాయింట్ మెంట్ ఇచ్చిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలనడం వారందర్నీ అవమానించడమే. అసలు హీరోలను ఇంటిలోపలికి కూడా రానివ్వలేదు. వారి కార్లను రోడ్ బయటనే ఆపించి.. సెక్యూరిటీ ద్వారా చెక్ చేయించి లోపలికి పంపించారు. దానిపైనా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన సమావేశ వీడియోను విడుదల చేసినప్పుడు చిరంజీవిని దారుణంగా అవమానించారన్న ఆరోపణలు వచ్చాయి. అంత వరకూ బయట ప్రపంచానికి తెలుసు. అయితే హీరోలను కలిసేందుకు జగన్ రాలేదని.. చిరంజీవి ప్రత్యేకంగా అడగడంతోనే ఆయన వచ్చిటన్లుగా ఇప్పుడు బయటకు రావడం సంచలనం అయింది. చిరంజీవి గట్టిగా అడిగారని కామినేని.. అడగలేదని బాలకృష్ణ చెప్పడం .. కొత్త వివాదానికి కారణం అయింది.