అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్‌కు లేఖ రాశారు. అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు పై నేను ఎటువంటి వ్యాఖ్య చేయదలుచుకోలేదు కానీ గౌరవ హైకోర్టు వారు శాసన సభకు రాజధాని మార్చడానికి గాని లేదా రెండు మూడు రాజధానులుగా విభజించుటకు గాని శాసన అధికారము లేదనే వ్యాఖ్య నన్ను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నదని లేఖలో ధర్మాన పేర్కొన్నారు.


మన రాజ్యాంగ మౌలిక సూత్రాలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించి శాసన నిర్మాణం, కార్య నిర్వాహక మరియు న్యాయ వ్యవస్థల పరుధులను స్పష్టముగా నిర్ణయించి నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. దీనినే ప్రజాస్వామ్య వ్యవస్థలో "Doctrine of Separation of powers" గా పేర్కొంటూ రాజ్యాంగము ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. దీని వల్ల శాసన సభ, కార్య నిర్వాహక వర్గము, న్యాయ వ్యవస్థ వాటి వాటి పరుధులకు లోబడి ఒక దానిని ఒకటి అతిక్రమించకుండా, ఒక దానిలో ఇంకొకటి జోక్యం చేసుకోకుండా ప్రజలకు సుపరిపాలన అందించటం లక్ష్యంగా రాజ్యాంగ నిర్మాతలు  ఒక మహత్తరమైన  లక్ష్యం తో చేసిన ఏర్పాటని విశ్లేషించారు. 


శాసనాలు తయారు చేయటం, విధివిధానాలు రూపొందించటం, ప్రజా సంక్షేమానికి,భద్రతకు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి అవసరమైన చట్టాలు రూపొందించటం రాజ్యాంగం ద్వారా  రాష్ట్ర శాసన సభకు సంక్రమించిన హక్కు, బాధ్యత అని ధర్మాన స్పష్టం చేశారు.  ఈ హక్కును వినియోగించుకోకపోతే రాష్ట్ర శాసన సభ తన బాధ్యతను విస్మరించినట్టే కదా అని సందేహం వ్యక్తం చేశారు. ఇటువంటి హక్కును, బాధ్యతను కాదనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని తాను భావిస్తున్నానన్నారు.. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెలిబుచ్చిన  తీర్పు శాసనసభ అధికారాలలోను బాధ్యత నిర్వహణలోను న్యాయ వ్యవస్థ జోక్యం కలిగిస్తుందని ఎవరికైనా అర్థమవుతుందన్నారు. 


కాబట్టి శాసనసభ,న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహక వర్గం వాటి వాటి పరుధులు, బాధ్యతలు, అధికారాలు పై చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మూడు విభాగాల మధ్య రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా చర్చించటానికి వీలుగా శాసన సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నానని లేఖలో ధర్మాన కోరారు. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న సమయంలో అక్కడ చర్చించడానికి అవకాశం ఉన్నా ధర్మాన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరడంతో వైఎస్ఆర్‌సీపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నట్లుగా భావిస్తున్నారు.