MLA Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. వైఎస్ షర్మిల (YS Sharmila)తో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్‌లో చేరే మొదటి ఎమ్మెల్యేను తానేనని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress Party) నుంచి పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, షర్మిల, కాంగ్రెస్ సూచనల మేరకు నడుచుకుంటానని స్పష్టం చేశారు. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరుతానని, ఆమెతో పాటు రాజకీయాల్లో కొనసాగుతానని తేల్చిచెప్పారు. అమరావతిపై చంద్రబాబు (Chandrababu), జగన్ చేసిన తప్పులను షర్మిలకు చెబుతానన్నారు. అలాగే నేడు తాడేపల్లిలో జగన్‌ను షర్మిల కలవడంపై ఆర్కే స్పందించారు. వైఎస్ జగన్‌ను షర్మిల కలవడం వెనుక రాజకీయం లేదని తెలిపారు.


సీఎం క్యాంపు కార్యాలయానికి 
వైఎస్ షర్మిల, విజయమ్మతో కలిసి తాను కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నానని, షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకే జగన్‌ను కలిసేందుకు వెళ్తున్నట్లు ఆర్కే చెప్పుకొచ్చారు. తాను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడినేనని, షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరాక పోటీపై నిర్ణయం తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ పెద్దలు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. టీడీపీతో కాంగ్రెస్ కలుస్తుందని తాను భావించడం లేదని, అది జరిగే పని కాదన్నారు. అమరావతిని తాను వ్యతిరేకించలేదని, బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేయడాన్నే తాను తప్పుబట్టానన్నారు.


రైతుల నుంచి భూములు లాక్కున్నారని ఆరోపణలు.. 
స్వచ్చంధంగా రాజధానికి భూములు ఇవ్వవచ్చని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పిందని, కానీ బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కున్నారని ఆర్కే ఆరోపించారు. భూసేకరణలో చంద్రబాబు చేసిన తప్పిదాలపై న్యాయస్థానంలో పోరాటం చేశానన్నారు. గత నాలుగున్నరేళ్లల్లో వైసీపీ ప్రభుత్వంలో తాను ఎక్కడ విఫలమయ్యానో ప్రజలకు వివరిస్తానని, రేపటి నుంచి విపక్ష పాత్ర పోషిస్తానని ఆర్కే వివరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజధాని ప్రాంతంలో రైతలుకు ఊరటనిచ్చేలా పలు మార్పులు చేశారన్నారు.


కాంగ్రెస్ నుంచి వచ్చిన తాము.. తిరిగి అదే పార్టీలోకి వెళ్తున్నట్లు ఆర్కే తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం ముందు నుంచి ఉందని, సంస్థాగతంగా బలమైన పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా తీసుకుంటానని, పార్టీ విధానాలు అనుగుణంగా నడుచుకుంటానని అన్నారు. ఓటుకు నోటు కేసులో న్యాయపోరాటం కొనసాగిస్తానని, తప్పు ఎవరు చేసినా తప్పేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.


ఢిల్లీకి వైఎస్ షర్మిల 
కాగా షర్మిల నేడు వైఎస్సార్‌టీపీ ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. గురువారం ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు వారితో భేటీ కానున్నారు. వారి సమక్షంలో రేపు కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేయనున్నారని తెలుస్తోంది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం దాదాపు ఖాయమైందని వార్తలొస్తున్నారు. అలాగే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి కూడా ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా షర్మిల పోటీ చేయనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పీసీసీ పగ్గాలు అప్పగిస్తే తప్పనిసరిగా షర్మిల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముంది. దీంతో కడపనే షర్మిల ఎంచుకునే అవకాశముంటుంది.