Talasani Srinivas : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసింది. అధికారం శాశ్వతం కాదు. ఒకప్పుడు కేంద్ర రాజకీయాలల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం. సుమారు 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు’’ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తర్వాత సోషల్ మీడియాలోనూ అదే స్పందన పెట్టారు.
చంద్రబాబునాయుడును అరెస్టు చేసిన తర్వాత బీఆర్ఎస్ నేతలు కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. మొదట కేటీఆర్.. చంద్రబాబు అరెస్టు గురించి తమకు ఏమీ తెలియదని.. అది ఏపీ రాజకీయాలకు సంబంధించిన అంశమన్నారు. ఐటీ ఉద్యోగులు ఆందోళన చేస్తే ఊరుకునేది లేదని అనుమతులు కూడా ఇవ్వబోమన్నారు, లోకేష్ ఫోన్ చేయించారని అయినా శాంతిభద్రతలే ముఖ్యమని చెప్పానన్నారు. అయితే ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు అరెస్టు బాధాకరమని.. వైసీపీవి కక్ష సాధింపు రాజకీయాలు అనే ప్రకటనలు బీఆర్ఎస్ నేతలు చేస్తూ వస్తున్నారు., హరీష్ రావు కూడా అదే చెప్పారు. ఇక టీడీపీలో ఉండి.. బీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలంతా చంద్రబాబు అరెస్టును ఖండించారు.
చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్ నేతల వ్యవహారశైలి కారణంగా సెటిలర్లలో అసంతృప్తి ఉందని.. వారు ఓట్లు దూరమవుతాయన్న నివేదికలు రావడంతోనే ఆలస్యంగా స్పందించారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు.. చంద్రబాబుకు సంఘిభావం చెబుతున్నారు. కొంత మంది బీఆర్ఎస్ సీనియర్ నేతలు నేరుగా రాజమండ్రి వెళ్లి చంద్రబాబు కుటుంబసభ్యులకు సంఘిభావం కూడా తెలిపారు.
తెలంగాణలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పలు చోట్ల ఇప్పటికీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనల్లో బీఆర్ఎస్ నేతలే ముందుంటున్నారు. ఖమ్మం, నల్లగొండ, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్ వంటి చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్హవిస్తున్నారు. తాజాగా భద్రాచలంలోనూ పెద్ద ర్యాలీ నిర్వహించారు.