Minister Sandhya Rani son Case: ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాజీ వ్యక్తిగత సహాయకుడు సతీష్, ఆమె కుమారుడిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర అని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో వీరు కోట్లాది రూపాయలు వసూలు చేశారంటూ సోషల్ మీడియాలో సాగిన ప్రచారం వెనుక త్రివేణి అనే మహిళ , సాలూరు మున్సిపల్ ఉద్యోగి దేవిశ్రీ ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. మంత్రి ప్రతిష్టను దిగజార్చేందుకు తప్పుడు ఆధారాలను సృష్టించి పోలీసులను, ప్రజలను తప్పుదోవ పట్టించారని ఎస్పీ వెల్లడించారు.
మంత్రి కుమారుడి పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్స్
ఈ కేసులో ప్రధాన ట్విస్ట్ ఏమిటంటే, నిందితులు వాడిన సాంకేతిక పరిజ్ఞానం. మంత్రి పిఏ సతీష్ , ఆమె కుమారుడి పేర్లతో ఫేక్ వాట్సాప్ అకౌంట్లు సృష్టించి, వారే స్వయంగా చాటింగ్ చేసుకున్నట్లుగా స్క్రీన్ షాట్లను నిందితులు రూపొందించారు. ఈ స్క్రీన్ షాట్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా, అవి కృత్రిమంగా సృష్టించినవని (Fake Screenshots) శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యింది. డబ్బులు డిమాండ్ చేసినట్లుగా ఉన్న చాటింగ్ అంతా ఫోటోషాప్ , ఇతర యాప్‌ల ద్వారా సృష్టించిన మాయాజాలమని పోలీసులు ప్రాథమిక ఆధారాలను కనిపెట్టారు.
మున్సిపల్ ఉద్యోగిని సాయంతో మహిళ కుట్ర
నిందితురాలు త్రివేణి గతంలో కూడా పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సాలూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న దేవిశ్రీ ఆమెకు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ నాటకానికి తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న తదుపరి, వారు ఏ విధంగా ఈ ఫేక్ చాట్స్ క్రియేట్ చేశారో పూర్తి ఆధారాలను సేకరించారు.
సాక్ష్యాలను సేకరించిన పోలీసులు
తప్పుడు ఆరోపణలు చేసి ప్రభుత్వంపై బురద జల్లడమే కాకుండా, ఫోరెన్సిక్ నివేదికలో నిజాలు బయటపడటంతో పోలీసులు త్రివేణి , దేవిశ్రీలను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా మాస్టర్ మైండ్స్ ఉన్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారిపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హెచ్చరించారు.