Minister Peddireddy Comments on Sharmila: రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ పని చేసినా అది మాకు ప్రత్యర్థి పార్టీయేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (PeddiReddy RamaChandrareddy) అన్నారు. చిత్తూరు (Chittore) నాగయ్య కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనంపై స్పందించారు. సీఎం జగన్ (CM Jagan) కు వ్యతిరేకంగా ఎవరు  పని చేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని చెప్పారు. 'షర్మిల (Sharmila) కాంగ్రెస్ (Congress) లోకి వెళ్లినంత మాత్రాన మా కాళ్లు మేం నరుక్కుంటామా.?' అని ప్రశ్నించారు. 'మా నాయకుడు జగన్ కోసం మేం ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాం. షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు. జగన్ ను మరోసారి సీఎం చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.' అని స్పష్టం చేశారు.


టీడీపీ, కాంగ్రెస్ పై విమర్శలు


కుటుంబాల్లో చిచ్చు పెట్టడం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బాగా తెలుసని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు (Chandrababu), సోనియా గాంధీ ఇద్దరూ కలిసే జగన్ ను జైలుకు పంపారని ఆరోపించారు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతాననే పగటి కలలు కంటున్నారని, అది కలగానే మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలో రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అటు, సీఎం జగన్ పై వైసీపీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విమర్శలు చేయడాన్ని మంత్రి ఖండించారు. జడ్పీటీసీ గెలవలేని వ్యక్తిని ఎమ్మెల్యే చేశామనేది గుర్తించాలన్నారు. పూతలపట్టులో పార్టీ ఇంఛార్జీని మార్చాలన్న సీఎం నిర్ణయంపై విమర్శలు చేయడం ఎంఎస్ బాబుకు తగదన్నారు. ఎవరో రెచ్చగొడితే ఇలా మాట్లాడడం సబబు కాదని, ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకుని వైసీపీ కోసం పని చేస్తే బాగుంటుందని హితవు పలికారు. 


అలాగే, కాంగ్రెస్ లో షర్మిల చేరికపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సైతం స్పందించారు. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు ఇబ్బంది లేదని.. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని అన్నారు. మరోవైపు, మాజీ మంత్రి కొడాలి నాని సైతం షర్మిల చేరికపై స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే తమకొచ్చే ఇబ్బందేం లేదని చెప్పారు. ఆమె ఆ పార్టీలో చేరితే మా ఓటు బ్యాంకు ఎందుకు చీలుతుందని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు కూడా లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుటుంబాల మధ్య చిచ్చు పెడతారని, తమకు పనికిరాని వాళ్లు, టీడీపీకి పనికొస్తారని అన్నారు. కాగా, ఏ పార్టీలో చేరాలనేది షర్మిల ఇష్టమేనని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నిన్నటివరకూ ఆమె తెలంగాణలో ఉండగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఏం మాట్లాడుతారో చూడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


Also Read: YS Sharmila joins In Congress: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల- వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ విలీనం