Minister Nara Lokesh Strong Reply To Congress Leader Jairam Ramesh: ప్రధాని మోదీ ఆదివారం మన్ కీ బాత్‌లో అరకు కాఫీ గురించి ప్రస్తావిస్తూ.. 'అరకు కాఫీ రుచి అద్భుతం. ఆ క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి.' అంటూ సీఎం చంద్రబాబుతో అరకు కాఫీ రుచి చూస్తోన్న ఫోటోలు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. 'అరకు ఆర్గానిక్ కాఫీ బ్రాండ్‌ను తానే కనిపెట్టినట్లుగా మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ (PM Modi) ముద్ర వేసుకున్నారు.' అంటూ పేర్కొన్నారు. 'రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలోని సుందర అరకు లోయలో గిరిజన సంఘాలు కాఫీ సాగుకు చొరవ చూపడానికి నాంది ఫౌండేషన్ బాధ్యత వహించింది. అప్పుడు రాష్ట్ర వాణిజ్య మంత్రిగా, డిసెంబర్ 21, 2007న అరకులో బ్రాండ్ ప్రారంభించడం నాకు విశేషం. ఐదేళ్ల తర్వాత నేను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తిరిగి ఆ ప్రాంతంలో పర్యటించాను.' అని ట్వీట్‌లో వెల్లడించారు.






నారా లోకేశ్ ఘాటు స్పందన






అయితే, ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. జాతీయ పార్టీ నాయకుడైన మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నామని ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 'అరకు కాఫీ గురించి ప్రధాని మోదీ గొప్పగా చెప్పారు. దశాబ్దాలుగా క్రియాశీలంగా ఉన్న గిరిజన సహకార సంఘం గురించి స్పష్టంగా వివరించారు. అరకు కాఫీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు, షేర్ చేసిన ఫోటోలపై సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మీరు అనుకుంటున్నట్లుగా మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.


కాగా, ఆదివారం మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. కాఫీ రుచి అద్భుతమని.. ఆ క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ అరకు కాఫీ రుచి ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. 'మీతో మరో కప్ కాఫీ తాగేందుకు ఎదురుచూస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.


Also Read: CM Chandrababu: 'చంద్రబాబు 4.0 అంటే ఏంటో చూస్తారు' - సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మధ్య నవ్వుల పువ్వులు