టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను ఎలాగైనా సీఎంను చేయాలని సీఎం జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని(Kodali Nani) అన్నారు. సన్నబియ్యం తక్కువ రేటుకు ఎగుమతిలో అవినీతి జరగలేనద్నారు.  నిజానికి కాకినాడ నుంచే కాకుండా చెన్నై పోర్టు నుంచి కూడా బియ్యం ఎగుమతి అవుతుందని, అంతే కాకుండా బిహార్, ఒడిషా, మధ్యప్రదేశ్‌ నుంచి కూడా ఇక్కడికి బియ్యం వస్తుందన్నారు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోందన్నారు. ధాన్యాన్ని ఎగుమతి చేయడంలో కాకినాడ పోర్టు(Kakinada Port) అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఇవాళ పంటల సాగు చాలా స్పష్టంగా ఈ–క్రాపింగ్‌(E-Cropping)లో నమోదు అవుతుందని తెలిపారు. దాని వల్ల ఎక్కడ, ఏ పంట వేశారన్నది తెలుస్తుందని మంత్రి తెలిపారు. ఇంకా ఆర్బీకేల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతులు అక్కడికి ధాన్యం తీసుకురావాల్సిన అవసరం కూడా లేదన్నారు. వారు తమ ధాన్యం గురించి సమాచారం ఇస్తే, పౌర సరఫరాల శాఖ స్వయంగా కల్లాల వద్దకే వెళ్లి, ధాన్యం తీసుకుని, బిల్లులు చెల్లిస్తోందన్నారు. నిజానికి గతంలో రైతులు ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయిస్తే, వారికి రకరకాల కారణాలు చెప్పి, తక్కువ ఇస్తున్నారని చెప్పి సీఎం జగన్(CM Jagan) మొత్తం విధానాన్నే మార్చారన్నారు. 


అలాగే బియ్యం నాణ్యత పెంచడం కోసం సార్టెక్స్‌(Sortex) చేయడంతో పాటు, ప్రభుత్వం నూక శాతం తగ్గిస్తోందని మంత్రి కొడాలి నాని అన్నారు. అందుకోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి, పూర్తిగా నాణ్యతతో కూడిన బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా సరఫరా చేస్తోందన్నారు. అంతే కాకుండా అవి కల్తీ కాకుండా ఇంటి వద్దే సీల్‌ తీసి బియ్యం ఇస్తున్నారన్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారన్నారు. చంద్రబాబుకు 70 ఏళ్లు దాటినా బుద్ధి రాలేదన్నారు. 50 ఏళ్లు దాటని జగన్‌పై రోజూ దాడి చేస్తున్నారన్నారు. అందుకే చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఈ ఖరీఫ్‌ (2021–22) సీజన్‌లో వచ్చే నెల వరకు దాదాపు 45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా అన్నారు. ఇప్పటికే 34.28 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరించగా, 5,02,132 మంది రైతులకు  రూ.6,667 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా ఇవాళ్టికి రూ.3,946 కోట్లు చెల్లించామన్నారు. 21 రోజులు కూడా పూర్తి కాకముందే రైతులకు ధాన్యం బిల్లులు ఇస్తున్నామన్నారు. ఇంకా దాదాపు రూ.1600 కోట్లు బకాయిలు ఉండగా, రోజూ దాదాపు రూ.150 కోట్ల వరకు రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. 


గతంలో చంద్రబాబు పసుపు కుంకుమ కింద ఈ డబ్బులు వాడుకుని, దాదాపు రూ.1000 కోట్లు బాకీ పెట్టి పోయారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. మరోవైపు దాదాపు రూ.2 వేల కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ, విత్తనశుద్ధి కర్మాగారాలకు మరో రూ.700 కోట్లు బకాయి పెట్టిపోతే, వైసీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు. గత డిసెంబరులో పంట నష్టం జరిగితే, రెండు నెలల్లోనే రూ.540 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చామని స్పష్టం చేశారు. పంట నష్టం జరిగితే రెండు నెలల లోపే ఇన్‌పుట్‌ సబ్సిడీ(Input Subsidy) ఇప్పటి వరకు దేశంలో ఎవ్వరూ ఇవ్వలేదన్నారు. మంచి పనులు జరుగుతుంటే సీఎం ఇంకా బలపడతారని అనుకున్న చంద్రబాబు, ఓడిపోయిన సర్పంచ్‌లతో అవగాహన సదస్సు పెట్టి, విమర్శలు చేశారన్నారు. క్యాసినో గురించి, డీజీపీ(Dgp) గురించి, ఆయన బదిలీ గురించి, పోస్టింగ్‌ గురించి మాట్లాడిన చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు 14 ఏళ్లలో ఎంత మంది సీఎస్‌లను, డీజీపీలను మార్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్నప్పుడు బదిలీలు సహజమన్న ఆయన కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నారని టీడీపీ నేతల్ని విమర్శించారు. 


'వివేకా ఛార్జ్‌షీట్‌లో చాలా విషయాలు ఉంటాయి. కానీ అన్నీ బయటకు రావడం లేదు. ఎవరికి నచ్చిన అంశం వారు బయటకు తీసుకువస్తున్నారు. గతంలో జగన్‌పై కేసు నడిచినప్పుడు కూడా చూశాం. సీబీఐ జేడీ తమకు కావాల్సిన వారికి లీక్‌లు ఇచ్చేవారు. ఎవరినైనా చంపితే వారి పదవులు, డబ్బులు వస్తాయా? నిజానికి నాడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపి, ఆయన మరణానికి చంద్రబాబు కారణమయ్యాడు. కానీ ఇక్కడ అది కాదు కదా. ఆయనను (వివేకానందరెడ్డి) హత్య చేస్తే, జగన్‌ ఏమొస్తుంది? ఆయనకు ఏమైనా పదవి వస్తుందా? ఆస్తి వస్తుందా? నిజానికి వారి కుటుంబం దేవుడిని నమ్ముకున్న కుటుంబం. ప్రజలను నమ్ముకున్న కుటుంబం. జగన్ కుటుంబ సభ్యుల ఆడవారిపై మాట్లాడారు. మరి మేము కూడా అలా మాట్లాడితే మీరు తట్టుకోగలరా?. పదవులు శాశ్వతం కాదు. చరిత్ర శాశ్వతం. ఎన్టీఆర్‌(NTR) చరిత్రలో నిల్చిపోయారు. వైయస్సార్‌(YSR) చనిపోతే ప్రజలు ఇప్పటికీ గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన కుమారుడిని సీఎం చేశారు. జగన్‌ నిరంతరం ప్రజల బాగు కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం తపించే మంచి మనసున్న వ్యక్తి. కానీ మీరు.. మీ పేపర్లు, ఛానళ్లను మాత్రమే నమ్ముకున్నారు. చివరకు కొడుకును ఎమ్మెల్యే(MLA)గా కూడా గెలిపించుకోలేకపోయారు. కుప్పంలో కనీసం సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేదు. అలాంటి వ్యక్తి ఇవాళ సర్పంచ్‌లకు అవగాహన కల్పించడం ఏమిటి? పోనీ అక్కడైనా పనికి వచ్చే విషయాలు చెప్పారా? అంటే అదీ లేదు.'


జగన్‌ క్యారెక్టర్‌ ప్రజలకు స్పష్టంగా తెలుసు కాబట్టే, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్డడంతో పాటు, ఆ తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికలతో పాటు, స్థానిక ఎన్నికల్లో కూడా పూర్తిగా గెలిపించారని మంత్రి కొడాలి నాని అన్నారు. అందుకే ఆయన క్యారెక్టర్‌ గురించి ఏ మాత్రం క్యారెక్టర్‌ లేని ఫోర్‌ ట్వంటీగాళ్లు చెబితే నమ్మే స్థితిలో ప్రజలు లేరని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.