తెలుగు దేశం పార్టీ నేతలపై మంత్రి జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బొక్క పార్టీ కి అధ్యక్షుడిగా ఉన్న అచ్చెం నాయుడుకు జగన్ ను విమర్శించే హక్కు లేదని, దమ్ముంటే అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు.
తెలుగు దేశం వాస్తవ పత్రం పై వైసీపీ కౌంటర్
బొక్క పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు , రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కు ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించే హక్కు లేదని మంత్రి జోగి రమేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం మీద ప్రకాశించని నవరత్నాలు అంటూ అవాస్తవ పత్రాలు విడుదల చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నవి ప్రకాశించే నవరత్నాలని అన్నారు. జగన్ చేస్తున్న సంక్షేమం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని, అయితే బొక్క పార్టీ నేతలకు మాత్రం అవి అర్థం కావని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు తెలుగు దేశం నేతలకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. గడప గడపకు వెళ్లి పథకాలు గురించి అడిగిన ప్రభుత్వాన్ని, గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు.
ఎక్కడయినా చర్చకు సిద్ధం..
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి గా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కి దమ్ము, దైర్యం, చీము, నెత్తురు ఉంటే కుప్పం ,టెక్కలి నియోజకవర్గంలో ఎక్కడైనా చర్చకు సిద్దమని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. 2014 నుండి 19 వరకు కుప్పం, టెక్కలి లో ప్రజలకు, ఎవరెవరికి ఏం ఇచ్చారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఎంత మేలు చేశామో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని, టైం, డేట్ ఫిక్స్ చేయాలని తెలుగు దేశం నేతలకు సవాల్ విసురుతున్నామని జోగి రమేష్ అన్నారు. జగన్ ఏం చేశాడో, చంద్రబాబు ఏం చేశాడో ప్రజలనే అడుగుదామని అన్నారు. ఈ ఛాలెంజ్ కి దమ్ముంటే ఒప్పుకోండి, సవాల్ స్వీకరించే సత్తా ఉందా అని ప్రశ్నించారు.
అసెంబ్లీ అయినా సరే..
తెలుగు దేశం నేతలు ప్రభుత్వంపై ఇష్టారీతిన విమర్శలు చేసి జారుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరువకావటంతో, తెలుగు దేశం నేతలకు మింగుడుపడటం లేదని అందులో భాగంగానే ప్రభుత్వంపై ఇష్టాను సారంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. పెడన నియోజకవర్గంలో చర్చకు వచ్చే దమ్ము తెలుగు దేశం నేతలకు లేదని, అయితే అసెంబ్లి సాక్షిగా అయినా చర్చకు వచ్చే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీని సైతం గౌరవించని తెలుగు దేశం నేతలకు వాస్తవాలు ఎప్పుడూ మింగుడుపడవని వ్యాఖ్యానించారు. చంద్రబాబును సైతం అచ్చెం నాయుడు బహిరంగంగానే తిడుతున్నారని, అచ్చెన్నాయుడుకు శరీరం పెరిగింది కాని బుర్ర పెరగలేదని మంత్రి జోగి రమేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పై సవాల్ విసిరే ముందు తెలుగు దేశం నేతలు తమ హయాంలో ఏం సాధించారో తెలుసుకోవాలని సూచించారు.