Amarnath On Pawan Kalyan: జనసేన పొలిటికల్ పార్టీ కాదు.. సినిమా పార్టీ అంటూ మంత్రి గుడివాడ అమర్ నాథ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ పార్టీ కోసం కూర్చుని మాట్లాడుకోవాల‌్సిన అవసరం తమకు లేదని అన్నారు. విశాఖ నోవాటెల్ హోటల్ లో జరిగిన ఎలిప్ శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీపై, జనసేనానిపై విమర్శలు చేశారు. గడిచిన మూడేళ్లలో జరిగిన కాపు సంక్షేమం కోసం మాత్రమే చర్చించకున్నామని వివరించారు. కాపు సంక్షేమం కార్యాచరణ రూపొందించామన్నారు. రాష్ట్రంలో 20 శాతం ఓట్లు ఉన్న ఒక సామాజిక వర్గానికి మేం ఏం చేశామో వివరించామన్నారు. 


హత్య గురించి మాట్లాడి.. తెర వెనుక వ్యూహకర్తలతో సమావేశం..


వంగవీటి రంగ హత్య విషయంపై పవన్ మాట్లాడడం అనైతికం అంటూ మండిపడ్డారు. వంగవీటి రంగా హత్య గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్, కొద్దీ సేపటికే ఆ సంఘటన తెర వెనుక వ్యూహకర్తలను కలిశారంటూ మంత్రి అమర్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నుంచి పది మంది గెలుస్తే చాలని పవన్ కల్యాణ్ భావిస్తున్ననట్లు వివరించారు. ఈ పది మంది కూడా చంద్రబాబును సీఎం చేయాలి అనుకుంటున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ చాలా నయం అంటూ ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 175కి 175 సీట్లు పోటీ చేస్తాను అని చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. అమరావతి రైతుల యాత్ర ఫేక్ రైతులు యాత్రని, ఐడి కార్డులు అడిగితే అలిగి బస్ ఎక్కి వెళ్లిపోయారంటూ విమర్శించారు. వాళ్లు రైతులు కాదని.. కేవలం డబ్బులు ఇస్తామంటే వచ్చిన వాళ్లని తెలిపారు. 


నాలుగు నెలలుగానే కాపులు ఎందుకు గుర్తొస్తున్నారు..


పవన్ కళ్యాణ్ కాపుల కస్టోడియన్ కాదని.. అలాంటి అతనికి నాలుగు నెలలుగా కాపులు ఎందుకు గుర్తొచ్చారని ప్రశ్నించారు. ముద్రగడపై దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారంటూ ధ్వజమెత్తారు. చిరంజీవి, దాసరి నారాయణరావు స్పందించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని అడిగారు. 2014లో చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేశారని, 2019లో విడిపోయి పోటీ చేశారని.. 2024లో మళ్లీ కలిసి పోటీ ఇవ్వాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 


కులాల మేలు కోసమే కార్పొరేషన్లు..


కులాల మేలు కోసం పెట్టిన కార్పొరేషన్ల వల్ల మేలు జరగలేదని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారని, కులాలకు ఇంతకంటే ఎక్కువగా ఏ ప్రభుత్వంలో అయినా సామాజిక న్యాయం జరిగిందా? అని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. దాదాపు 1.8 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో మూడున్నరేళ్ళలోనే వైసీపీ ప్రభుత్వం వేసిందన్నారు. పసుపు కళ్లజోడు పెట్టుకుని, ఎన్టీఆర్‌ భవన్‌ స్క్రిప్టుతో మాట్లాడితే పవన్ కు కనిపించవన్నారు.  అన్ని కులాలకు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇస్తూ ఆలయ బోర్డుల్లో, నామినేటెడ్‌ పదవుల్లో సగం అందులోనూ సగం మహిళలకు కేటాయించటం సామాజిక న్యాయం కాదా? అని ప్రశ్నించారు.