Dharmana : శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కాకపోవడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు చిక్కు వచ్చి పడింది. తూర్పు కాపులకు సీటు ఇవ్వలేదని ఆ వర్గం నుంచి ఒకరు పోటీలో నిలబడ్డారు. స్థానిక సంస్థల్లో అత్యధిక మంది ఓటర్లు ఆ వర్గం వారు కావడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు టెన్షన్ పడుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ విస్తృత కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి..కులం పేరుతో ఇతరులకు ఓటేయవద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థికి కాదని ప్రత్యర్థికి ఓటు వేస్తే సహించేది లేదని స్పష్టం చేసారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓట్లు వేసే వారిని వైకాపా నుంచి సస్పెండ్ చేస్తామన్నారు.
శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో గల ఆనందమయి ఫంక్షన్ హాల్ లో మంగళవారం జిల్లా వైకాపా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ 1983 తర్వాత యాదవులు అంతా టిడిపికి వెళ్లిపోయారన్నారు. చంద్రబాబు హయాంలో యాదవులకి ఎక్కడా స్థానం కల్పించలేదన్నారు. యాదవులకి సముచిత స్థానం ఇచ్చిన వ్యక్తి జగన్ అన్నారు. కాపులు అపార్ధం చేసుకోవద్దన్నారు. తూర్పు కాపు కులంకి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తూర్పు కాపు కులం,ఎంపిటీసీల కులం పేరుతో హడావిడి చేసే వారి మాయలో పడొద్దని హెచ్చరించారు.
తూర్పు కాపు పేరుతో కొందరు ట్రాప్ చేయాలని చూస్తున్నారన్నారు. ఎవరైనా ప్రలోభాలకి లొంగి వ్యతిరేకంగా ఓటు వేసారని తెలిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు. పార్టీకి ప్రతి ఇంటికి ఒక వేగు ఉన్నారన్నారు. ఎక్కడ ఏమి జరుగుతుందో తెలిసిపోతుందన్నారు. ఎవరైనా డ్యాన్స్ కడితే తెలియకుండా ఉండదన్నారు. అన్ని రకాల వక్తులతో పోరాడి విశాఖ రాజధానిగా చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారన్నారు. రాజధాని వస్తే ప్రజల పరిస్థితి మారుతుందన్నారు. దానికి వ్యతిరేకంగా గ్రాడ్యుయేట్ లు ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. పట్టభద్రులకి అర్థమయ్యేటట్లు చెప్పాలని క్యాడర్ కి సూచించారు. ప్రతి వంద ఓట్లకి ఓ రిసోర్స్ పెర్సన్ ను ఏర్పాటు చేసామన్నారు. వైకాపా అభ్యర్థులు ఓడిపోతే పార్టీకి బలం లేదని అనుకునే ప్రమాదం ఉందన్నారు. రూరల్ లో ఏలాగు పార్టీ బలంగా ఉందని, ఎడ్యుకేటెడ్ లో కూడా బలంగా ఉన్నామని ఎమ్మెల్యేలు నిరూపించాలన్నారు.
విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనుకుం టున్నారని అందుచేత ఈ ఎన్నికలలో గెలుపొందాలన్నారు. ఓటమిని వేరొక రకంగా తీసుకువెళ్లే అవకాశాలకు అడ్డదారులు తొక్కే పరిస్థితి ఉంటుందని అందుచేత ఎమ్మెల్సీ అభ్యర్థిగా నర్తు రామారావును గెలుపున కు అంతా కలసి కట్టుగా పనిచేయాలని మంత్రి బొత్స పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి వెనుకబడిన వర్గాలకు అండగా ఉండడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. గత మూడున్నరేళ్లుగా సీఎం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందివ్వడంతో యావత్తు దేశమంతా జగన్ పాలనను ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆయన కొని యాడారు.
గెలుపు అనే దాని కంటే మన ప్రజా ప్రతినిధులు ఖచ్చితంగా ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అన్నారు. న్యాయ పరమైన చిక్కులు తొలగించుకుని ఏప్రిల్ తరువాత పరిపాలనా రాజదానిగా విశాఖ కు వస్తామని జగన్ చెప్పారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ లను గెలిపించి జగన్ కు స్వాగతం పలకాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సుబ్బా రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇండిపెండెంట్ ముసుగులో టీడీపీ అభ్యర్థి పోటీలో నిలబడడంపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రత్యర్థి టీడీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని వైసీపీ కేడర్ కు పిలుపునిచ్చారు.