Minister Botsa: రాష్ట్రంలో 6 జిల్లాలలో వరద ప్రభావం చూపిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ స్థాయిలో గతంలో ఏనాడూ వరదలు రాలేదని వివరించారు. నిన్న, మొన్న సీఎంగారు పర్యటించారని... బాధితులకు అందిన సహాయాన్ని గురించి అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. ఆరు జిల్లాలో దాదాపు 3.46 లక్షల మంది వరద ప్రభావానికి లోనయ్యారని.. వారిని పునరావాస శిబిరాలకు తరలించి తక్షణ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. సుమారు 219 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 1.80 లక్షల మందికి బస కల్పించగలిగామన్నారు. వారందరికీ వసతితో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించిట్లు మంత్రి బొత్స స్పష్టం చేశారు. 


గోదావరి వరదల్లో ఏడుగురు చనిపోయారని.. ఆ కుటుంబాలకు పరిహారం కూడా అందజేసినట్లు తెలిపారు. వారే కాకుండా పునరావాస కేంద్రాల్లో ఉండి ఇంటికి వెళ్తున్న వారికి రూ.2 వేలు, 25 కేజీల బియ్యం, లీటర్‌ నూనె, కేజీ పప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కూడా అందజేసినట్లు పేర్కొన్నారు. అవే కాకుండా ప్యాకేజీ ప్రకారం వారికి అన్నీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇవి కాకుండా పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పక్కాగా ఇస్తామని సీఎం చెప్పినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. పక్కా ఇళ్లు కట్టించిన తర్వాతే తరలిస్తామని వెల్లడించారు. మాది చిత్తశుద్ధితో పని చేసే ప్రభుత్వం అని.. అంతే తప్ప చంద్రబాబు మాదిరిగా ప్రచారం చేసుకునే అలవాటు మాకు లేదంటూ కామెంట్లు చేశారు. 


అదే పనిగా ఉపన్యాసాలు..


చంద్రబాబు తన పర్యటనల్లో వరద బాధితులను ఓదార్చడానికి బదులు రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారంటూ మంత్రి బొత్స తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు నిమిషాలకు ఒకసారి సీఎం జగన్‌ ని విమర్శించడమే ఆయన పనంటూ మండిపడ్డారు. అసలు చంద్రబాబు హయాంలో వరద బాధితులకు బట్టల కోసం రూ.2 వేలు, ఇతర సామాగ్రి కోసం మరో రూ.2 వేలు ఇచ్చాడని.. రూ.2.50 లక్షలతో ఇళ్లు కట్టించి ఇచ్చానిని చెప్తున్నారని... అసలు చంద్రబాబు హయాంలో వరదలు ఎప్పుడొచ్చాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో వర్షాలకు బదులు కరువే ఉందన్నారు. 


పోలవరం ఆలస్యానికి కారణం ఎవరు?


పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడానికి కారణం ఎవరంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టును వైయస్సార్‌ ప్రారంభించి, కాలువలు తవ్వించాడని... చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినా, 2017 వరకు ఒక్క పిడికెడు మట్టి కూడా వేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పని కూడా చేయలేదని.. ఎంతసేపూ స్వార్థం, కమిషన్ల యావ తప్ప  పోలవరం ప్రాజెక్టు స్వయంగా కడతామని రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాడంటూ మంత్రి కామెంట్లు చేశారు. చివరకు హోదాను కూడా తాకట్టు పెట్టాడంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. 


బాధ్యతగా ఆదుకున్నాం.. 


సుమారు 1.80 లక్షల మందిని సురక్షితంగా శిబిరాలకు తరలించామని మంత్రి బొత్స తెలిపారు. మొత్తం 546 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి... అన్ని ఔషథాలు అందుబాటులో ఉంచి ఎక్కడా అంటు వ్యాధులు ప్రబలకుండా చూస్తున్నామని తెలిపారు. శిబిరాల్లో ఉన్న వారిని అన్ని విధాలుగా ఆదుకున్నామన్నారు. అందుకే అన్ని పనులు జరిగిన తర్వాత, స్వయంగా వెళ్లిన సీఎం ప్రతి చోటా ప్రజలతో వివరాలు ఆరా తీశారని చెప్పరు. అందుకే ప్రజలు ఆయనను ఆమోదించారన్నారు. సీఎం జగన్‌.. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ గురించి కూడా చెప్పారని.. దానికి రూ.20 వేల కోట్లు కావాలని, అది కేంద్రం నుంచి రావాలని వెల్లడించినట్లు గుర్తు చేశారు. ప్రకటించిన ప్యాకేజీ ఇస్తామని స్పష్టంగా చెప్పారని.. ప్రజలు కూడా అందుకు సమ్మతించారన్నారు. 


సీఎం జగన్ వరద ముంపు ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించినట్లు మంత్రి బొత్స తెలిపారు. వరదల సమయంలో అందరూ కలిసి కట్టుగా పని చేసి ఎక్కువ మొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా కాపాడగల్గామని చెప్పారు. అందుకే చంద్రబాబు చెప్పిన ప్రతీ అబద్ధాన్ని ఖండిస్తున్నట్లు వివరించారు. దమ్ముంటే చంద్రబాబు ఏ వరదల్లో ఎవరిని ఆదుకున్నాడో? ఎక్కడ ఎన్ని ఇళ్లు కట్టించి ఇచ్చాడో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సీఎం జగన్ విమానంలో వెళ్లడాన్ని చంద్రబాబు తప్పు పట్టారని.. మరి ఆయన ఎలా వెళ్లారంటూ ప్రశ్నించారు. కాళ్లతో నడిచి వెళ్లి బాధితులను పరామర్శించారా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.