Botsa On CPS :  ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)పై ప్రభుత్వ నిర్ణయాన్ని రెండు నెలల్లో వెల్లడిస్తామని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.  ''ఎన్నికల ముందు మా పార్టీ ఇచ్చిన 100 హామీల్లో సీపీఎస్‌ ఒకటి. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. సీపీఎస్‌పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉంటుంది. మా నిర్ణయం రెండు నెలల్లో వెల్లడిస్తాం. ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఈ ఏడాది ఆఖరికల్లా పరిష్కరిస్తాం'' అని బొత్స  మీడయా ప్రతినిధులకు తెలిపారు. అంటే సమస్య మరో రెండు నెలల తర్వాతే పరిష్కరంచాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఉద్యోగులు ఇప్పటికే రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. మిలియన్ మార్చ్‌ చేయాలని ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆగిపోయారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు రెండు  నెలల గడువు పెట్టడంతో  ఉద్యోగ సంఘాలు కూడా ఎదురు చూసే అవకాశం ఉంది. 


సీపీఎస్ రద్దు చేసే ప్రశ్నే లేదని ఇప్పటికే తేల్చేసిన బొత్స


వాస్తవానికి సీపీఎస్ ను రద్దు చేసే అవకాశమే లేదని.. తాము తొందరపడి.. అవగాహన లేకుండా హామీ ఇచ్చామని నిర్మోహమాటంగానే మంత్రులు, సలహాదారులు చెబుతున్నారు. భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అందుకే సీపీఎస్‌ను రద్దు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. అదే సమయంలో ఉద్యోగులకు ప్రయోజన ంకలిగే జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని.. నెలకు కనిష్టంగా రూ. పదివేల పెన్షన్ అందిస్తామనే ప్రతిపాదన పెట్టారు. దీనపై ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన చర్చల్లో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కానీ ఉద్యోగ సంఘం నేతలు అంగీకరించలేదు.  సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని హామీ ఇచ్చినట్లుగా తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.  


జీపీఎస్ అమలుకు ప్రభుత్వ ఉద్యోగులను ఒప్పించాలనే ప్రయత్నం 


ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను ఎలాగైనా ఒప్పించి జీపీఎస్‌ను అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బిల్లు కూడా రెడీ చేశారని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తీసుకోవచ్చని కూడా అధికారవర్గాలు అనుకున్నాయి. కానీ ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ మరో రెండు నెలల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ప్రభుత్వం ఇప్పటికి వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల కల్లా సీపీఎస్ సమస్యకు ఏదో ఓ పరిష్కారం చూపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ నేరుగా ఇచ్చిన హామీ సీపీఎస్ రద్దు. ఉద్యోగ నేతలతో కలిసి ఉద్యమాలు కూడా చేశారు. అందుకే పరిష్కారం చూపాలని భావిస్తున్నారు. 


రెండు నెలల్లో కీలక నిర్ణయం


మంత్రి బొత్స సత్యనారాయణ సీపీఎస్‌పై సీఎం జగన్ నియమించిన మంత్రివర్గ సబ్ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనే ఉద్యోగ సంఘాలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు. రెండు విడతలుగా తన  ఇంట్లో నిర్వహించిన చర్చలు అనధికారికమేనని తాను చొరవ తీసుకున్నానని ప్రకటించారు. ఈ రెండు నెలల్లో ఆయన సమస్య పరిష్కారానికి మరింత చొరవ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.