Andhra News Seediri Appalraju :  ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు (  Appalraju )  పవన్ కల్యాణ్ , పురందేశ్వరిపై ఘాటు విమర్శలు చేశారు.   జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) సెన్స్ లేదన్నారు.  పూటకో మాట రోజుకో నాటకంలా.. ఆయన వ్యవహరించడం ప్రజలంతా చూస్తున్నారని మండిపడ్డారు.  చంద్రబాబు హయాంలో ఆనాడు ఐవైఆర్‌ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి..?’ పుస్తకాన్ని పవన్ ఆవిష్కరించారన్నారు.   ఈరోజు అదే అమరావతి పవన్‌ కల్యాణ్‌కు ముచ్చటైన వేదికగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు.  చంద్రబాబు ( Chandrababu ) మీద ఈగ వాలనీయకుండా.. సొంతకొడుక్కి లేని నొప్పి పవన్ ‌కల్యాణ్‌కి కలుగుతోందన్నారు.  జనసేన పార్టీని పవన్ కల్యాణ్ అమ్మేశాడని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తించాలని పిలుపునిచ్చారు.                                                 
 
నాదెండ్ల మనోహర్‌ పేరుకు జనసేన పార్టీలో ఉన్నప్పటికీ.. ఆయన రిలీజ్‌ చేసే ప్రకటనలేమో టీడీపీ నుంచి అందుతున్నాయేమోనని మంత్రి సీదిరి అప్పలరాజు సందేహం వ్యక్తం చేశారు. ఒకపక్కన తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు అంటారు. మరోవైపు ఆంధ్రకొచ్చేసరికి టీడీపీ నుంచి వచ్చిన స్క్రిప్టును బట్టీబడుతూ వారి చేతుల్లోనే ఇమిడిపోతున్నారు అని విమర్శించారు. నాదెండ్ల మనోహర్‌ సొంత బ్రెయిన్‌ వాడితే నిజాలు తెలుస్తాయంటూ ఎద్దేవా చేశారు.  మహిళలకు పశుసంవర్ధక శాఖ నుంచి ఏమీ అందలేదంటున్న మనోహర్‌ సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవాలన్నారు.  మహిళా సాధికారత విషయంలో మీ మాటలు మహిళల్ని, ప్రభుత్వాన్ని అవమానించే విధంగా ఉన్నాయని.. కనుక మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలని  అప్పలరాజు డిమాండ్ చేశారు.


మరో వైపు  ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై అప్పలరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఏపీలో మద్యం బ్రాండ్లను పురంధేశ్వరి టేస్ట్ చేస్తున్నారమేనంటూ అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న బూమ్ బూమ్ .. గవర్నర్ చాయిస్ ఇవన్నీ చంద్రబాబు పర్మిషన్‌తో వచ్చినవేనని చెప్పుకొచ్చారు. పురంధేశ్వరి వెళ్ళి చంద్రబాబునే మద్యం బ్రాండ్లపై ప్రశ్నించాలి అని సూచించారు. దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును పట్టుకుని రాజకీయాలు చేయకూడదన్నారు.  బీజేపీలోకి వచ్చి, చంద్రబాబుకు వంత పాడటం మొదలెట్టాక ఆమె పరువు దిగజారిపోయిందన్నారు. బీజేపీలో ఉన్న క్యాడరే పురంధేశ్వరితో విభేదిస్తున్నారని చెప్పుకొచ్చారు. పురంధేశ్వరికి టీడీపీపై మమకారం ఉంటే.. ఆమె ఆ పార్టీలో వెళ్లి చేరవచ్చు అని సూచించారు. పురంధేశ్వరి మాటలు చూస్తే.. ఆమె పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిందనిపిస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు సెటైర్లు వేశారు.