పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గత ప్రభుత్వంపై మరోసారి కీలక ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్‌కు భారీ నష్టం వాటిల్లిందని, అది చాలా వరకూ దెబ్బతిన్నదని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దాదాపు 485 మీటర్ల మేర దెబ్బతిన్నదని అన్నారు. పెద్ద పెద్ద గుంతలు కూడా ఏర్పడ్డాయని అన్నారు. వీటిని సరి చేయకపోతే పనులు ముందుకు సాగవని చెప్పారు. దీన్ని సరి చేసేందుకు దాదాపు 2 వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అన్నారు. కాఫర్ డ్యాం పనులు పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.


నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ద్వారా స్టడీ చేశారని, దీనిపై మూడు రోజుల క్రిందటే నివేదిక వచ్చిందని అంబటి రాంబాబు తెలిపారు. ఈ భారీ తప్పిదానికి ఎవరిపై చర్యలు తీసుకోవాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని అంబటి చెప్పారు. ఆదివారం (మార్చి 5) పోలవరం ప్రాజెక్టు పనుల్ని మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు.


పోలవరంపై తాను రాజకీయ ఆరోపణలు చేయడం లేదని, ఇది తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారి తెలియనితనం వల్ల జరిగిందని అన్నారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి, రిబ్బన్ కట్ చేయాలన్న తాపత్రయంతోనో కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తి చేయకుండా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించారని అన్నారు. దానివల్లే ఇప్పుడు ఇంత అనర్థం జరిగిందని స్పస్టం చేశారు. డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతినడానికి ముమ్మాటికీ మానవతప్పిదమేనని అన్నారు. ఏర్పడ్డ పెద్ద గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూసెక్కుల ఇసుక అవసరం అని చెప్పారు. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్‌ చేయడం కోసం రూ.2 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా అవుతుందని చెప్పారు.


డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో దెబ్బతిన్న భాగం మొత్తం బాగుచేసి ఎలా పనులు ముందుకు తీసుకెళ్లాలని అనే విషయంపై అధికారులు పరిశీలిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. పనులు పూర్తి చేయడానికి రాబోయే నాలుగైదు నెలలు కీలకమని చెప్పారు. ఇది వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కలలు కన్న ప్రాజెక్టు అని, సీఎం జగన్‌ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు. ఆయనే ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు.