Meta blocked Nara Lokesh WhatsApp : ప్రజలు ఎవరైనా వాట్సాప్ మెసెజ్ పంపిస్తే నారా లోకేష్ స్పందిస్తున్నారు. ఇటీవల కొంత మంది విద్యార్థుల సమస్యలను ఆయన పరిష్కరించిన విధానానికి భారీ పబ్లిసిటీ వచ్చింది. దీంతో చాలా మంది ఆయనకు వాట్సాప్ చేయడం ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేష్ వాట్సప్ ను మెటా బ్లాక్ చేసింది.
తరచూ బ్లాక్ అవుతున్న నారా లోకేష్ వాట్సాప్
వాట్సప్ బ్లాక్ కావడం, తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని మంత్రి నారా లోకేష్ ప్రజల్ని కోరారు. సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in కి పంపాలన్నారు. సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భరోసా ఇచ్చారు.
మెయిన్ ఐడీకి సమస్యలు పంపిస్తే తానే చూస్తానన్న నారా లోకేష్
ఎన్నికల్లో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రతి రోజు ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్‌ను ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో తన వాట్సప్‌కి వచ్చిన మెసేజ్ కు రియాక్ట్ అయ్యి 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కరించారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి సమస్య తీసుకెళితే చాలు పరిష్కారం అయిపోతుందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు. వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేష్‌కి వాట్సప్ చెయ్యడం వలన టెక్నికల్ సమస్యతో బ్లాక్ అయింది. తనకు సమాచారం పంపే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్సనల్ మెయిల్ అందరికీ అందుబాటులోకి తెచ్చారు.
ప్రజలకు అందుబాటులో మంత్రి
పాదయాత్రలో యువతకు తనను దగ్గరగా చేర్చిన "హలో లోకేష్" కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న మంత్రి... తానే అందరి సమస్యలు నేరుగా అడ్రస్ చేస్తానని ప్రకటించారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. మెయిల్ చేస్తే తాను స్పందిస్తానని తెలియజేశారు. వాట్సప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్లు చూసే అవకాశం ఉండటం లేదని , దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని కోరారు.