Janasena Leader Nagababu:ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు కు ఏపీ క్యాబినెట్‌లో చోటు దక్కడం ఖాయం అయింది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఆయన మంత్రి కానున్నట్లు తెలిసింది. నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఏపీ అసెంబ్లీ సీట్ల ప్రకారం 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు వీలుంది.

జనసేన నుంచి నాలుగో మంత్రి

ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో 24 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా బాధ్యతలను నెరవేర్చుతున్నారు. బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఇప్పుడు ఏపీ కేబినెట్‌లోకి మెగా బ్రదర్ నాగబాబును కూడా తీసుకోనున్నారు. మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవిని నాగబాబుకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై  తెలుగు దేశం పార్టీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

రాజ్యసభ సభ్యులు ఖరారు 

ప్రస్తుతం నాగబాబు ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక అయితే కాలేదు, ఆయనను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం ఇటీవల జరిగింది. అయితే సోమవారం రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో ఆ ప్రచారానికి తెరపడిపోయింది. బీజేపీ నుంచి ఆర్. క్రిష్ణయ్య పేరు  ఖరారు కాగా.. టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌లను రాజ్యసభ అభ్యర్థులుగా ఆయా పార్టీలు ఖరారు చేశాయి. నామినేషన్ వేసేందుకు మంగళవారం ఆఖరి రోజు కావడంతో సోమవారం రాత్రికి ముగ్గురు పేర్లను కూటమి నేతలు ఖరారు చేశారు. దీంతో ముగ్గురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్‌ వేయనున్నారు. ఎన్డీయే కూటమికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ప్రకారం మూడు సీట్లు ఏకగ్రీవం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

Also Read : Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్

 నాగబాబు త్యాగాలుమరోవైపు చివరిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల మెగా బ్రదర్ నాగబాబు త్యాగాలు చేస్తూ వస్తున్నారు. మంత్రి పదవి ద్వారా నాగబాబుకు మంచి అవకాశం దక్కినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో నాగబాబును అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని జనసేనాని పవన్ భావించారు.  సీటు ఇక నాగబాబుకే అన్న సమయంలో పొత్తుల లెక్కల్లో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కోసం అన్నయ్య సీటును పవన్ కళ్యాణ్ బీజేపీకి త్యాగం చేశారు. నాగబాబు కూడా కూటమి గెలుపు కోసం తన వంతు తీవ్రంగా కృషి చేశారు.  ఎన్నికల్లో గెలిచి  కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు నామినేటెడ్ పదవి ఇస్తారన్న వార్తలు వినిపించాయి. 

ఇటీవల కాలంలో టీటీడీ ఛైర్మన్‌గా నాగబాబును నియమిస్తారన్న ప్రచారం జరిగింది.  అయితే టీటీడీ ఛైర్మన్ పదవి ప్రముఖ మీడియా సంస్థ అధినేత బీఆర్ నాయుడికి దక్కింది. ఇప్పుడు రాజ్యసభకు పంపుతారంటూ వార్తలు రాగా.. ఈ అవకాశం కూడా తప్పిపోయింది. ఈ నేపథ్యంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుని సముచిత స్థానం కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు భావించారని తెలుస్తోంది.   

Also Read : Nagababu No Rajyasabha: జనసేనకు రావాల్సిన రాజ్యసభ సీటు బీజేపీకి - నాగబాబుకు లక్ కలసి రావట్లేదా ?