Breaking News Live: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 19 Feb 2022 09:32 AM
Sajjala: కర్నూలులో రోడ్డు ప్రమాదం సజ్జలకు తప్పిన ముప్పు

ప్రభుత్వ సలహాదారు,వైసీపీ నేత సజ్జల రామ కృష్ణ రెడ్డికి ప్రమాదం తప్పింది. సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఫ్లైఓవర్ పై కాన్వాయ్ వెళుతుండగా వాహనములు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీ కొట్టాయి. వైసీపీ నేత పత్తికొండ మురళీధర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన వస్తుండగా ప్రమాదం. కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ చేరుకునే మార్గమధ్యంలో స్వల్ప ప్రమాదం. దెబ్బతిన్న వాహనాలు. సురక్షితంగా గెస్ట్ హౌస్ కి చేరుకున్న సజ్జల.

ప్రేమ పేరుతో గ్రామ వాలంటీర్‌ దురాఘతం, యువకుడి ఇంటి వద్దే యువతి ధర్నా

విశాఖ జిల్లా రోలుగుంట మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో గ్రామవాలంటీర్‌ ఓ యువతిని గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మళ్లీ గర్భం తీయించాడు. ఈ ప్రేమ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. గర్భం తీయించిన గ్రామవాలంటీర్‌ తర్వాత మాట మార్చాడు. ఎన్నిసార్లు అడిగినా పెళ్లి గురించి పట్టించుకోవడం లేదు. దీంతో కోపం వచ్చిన యువతి ఆ యువకుడి ఇంటికి వెళ్లి ఆందోళన చేపట్టింది. ఆమె వచ్చిందని తెలిసిన ఆ యువకుడు ఇంటికి రాకుండా ఎటో వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని తమ పరువు తీయొద్దని ఒత్తిడి తీసుకొచ్చారు. పరిస్థితి తనకు అనుకూలంగా లేదని గ్రహించిన ఆ యువతి  100కు డయల్ కాల్ చేసింది.

Jagityal: శివాజీ విగ్రహావిష్కరణలో అపశ్రుతి

జగిత్యాల మండలంలో గల నర్సింగాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ లో అపశృతి చోటు చేసుకుంది. జగిత్యాల   ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ వసంత తో కలిసి ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా అక్కడ గూమిగూడిన యువకులు టపాసులు కాల్చుతుండగా పక్కనే ఉన్న టెంట్ పై కొన్ని  నిప్పు కణికలు పడ్డాయి... దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి టెంట్ పూర్తిగా దగ్ధమైంది. ఇక టెంట్ కింద ఉన్న  కుర్చీలను యువకులు హుటాహుటిన తొలగించడంతో అపాయం తప్పింది. మరో వైపు ఈ సంఘటన లో ఎవరికి ఎలాంటి గాయాలు , ప్రాణనష్టం చోటు చేసుకోలేదు.

తూర్పుగోదావరి జిల్లాలో పల్టీ కొట్టిన కారు

* తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టిన కారు


* ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు


* ఏలూరు - యానాం ప్రయాణంలో రామచంద్రపురం వద్ద ఘటన


* తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదం 


* కారు వెనుకనే పెళ్లి బృందం మరో వాహనం


* దీంతో వెంటనే క్షతగాత్రులు ఆస్పత్రికి తరలింపు

Medaram Jatara Accident: మేడారం జాతర సమీపంలో రోడ్డు ప్రమాదం, నలుగురి దుర్మరణం

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. గట్టమ్మ ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Tirumala Updates: శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు‌ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం‌ వి.ఐ.పి‌ విరామ సమయంలో ఏపి హైకోర్టు ‌న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, అన్నా రాంబాబు, సినీ నటి ఇషాన్‌ లు వేర్వేరుగా స్వామి వారి‌ సేవలో పాల్గోని‌ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి‌ స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి సేవలో మంత్రి శంకర నారాయణ

తిరుమల శ్రీవారిని ఏపి మంత్రి శంకర్‌ నారాయణ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం‌ వి.ఐ.పి‌విరామ సమయంలో స్వామి వారి‌ సేవలో పాల్గోని‌ మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి‌ స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీనివాసుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు..ఏపి రాష్ట్రం సుభిక్షంగా,  సస్యశ్యామలంగా ఉండేలా, రాష్ట్రాన్ని‌ పది కాలాల పాటు పరిపాలించే శక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసాదించాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.. సంక్షేమ, అభివృద్ధి పరిపాలన కొనసాగాలని, కష్టాల్లో ఉన్న వారి‌ సమస్యలను‌ తీర్చాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం జాతీయ రహదారి పై  తెల్లవారు జామున ఒరిస్సా నుండి వస్తున్న టూరిజం బస్సు ఆగివున్న లారీనీ బలంగా గుద్దడంతో పలువురికి తీవ్రగాయాలు కాగా కొంతమంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. జే.ఆర్.పురం ఎస్సై రాజేశ్  తెలిపిన సమాచారం ప్రకారం ఒరిస్సానుండి బస్సులో సుమారు నలభై ఏడు మందివరకు కేరళ, తమిళనాడుకు వెళుతున్నట్లు తెలిపారు. తెల్లవారు జామున పైడిభీమవరం జాతీయ రహదారి బస్సు డ్రవర్ నిద్ర మత్తులో ఆగివున్న లారీని బలంగా గుద్దడంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చని తెలిపారు. గాయపడ్డ 33 మందిని 108 హైవే అంబులెన్స్ లలో శ్రీకాకుళం రిమ్స్ కి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నదని వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారని మిగిలిన క్షతగాత్రులకు సంఘటన స్థలం వద్ద ప్రథమ చికిత్స అందించారు. స్థానికుల సమాచారం ప్రకారం జే.ఆర్.పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Background

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కుతోంది. గత కొన్ని రోజులుగా 15 డిగ్రీలుగా నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఒకట్రెండు చోట్ల మాత్రమే 20 కంటే తక్కువ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు.  ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది.


ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం (Daily weather report of Andhra Pradesh)లో ఏ మార్పులు లేవు. వాతావరణం మరింత వేడెక్కుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రలు గత రెండు రోజుల నుంచి విపరీతంగా పెరుగుతుండటంతో పగటి వేళ కొన్నిచోట్ల ఉక్కపోత అనిపిస్తుంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని పేర్కొన్నారు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.  కళింగపట్నంలో 18.6 డిగ్రీలు, బాపట్లలో 19.1 డిగ్రీలు, అమరావతిలో 19.5 డిగ్రీలు, విశాఖపట్నంలో 19.8 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.


రాయలసీమ​, తెలంగాణ ప్రాంతాల్లో చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. ఆరోగ్యవరం లాంటి ప్రాంతాల్లో ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు నమోదైంది. నంద్యాలలో 18.8 డిగ్రీలు, తిరుపతిలో 20 డిగ్రీలు, కర్నూలులో 20.9 డిగ్రీలు, అనంతపురంలో 20 డిగ్రీలు, కడపలో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


హీటెక్కుతోన్న తెలంగాణ
తెలంగాణలో ఆకాశం పాక్షింగా మేఘాలతో ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కురిశాయి. అయినా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు బాగా పెరిగింది. గ్రాముకు రూ.50 చొప్పున పెరిగింది. వెండి ధర కూడా కిలోకు రూ.600 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.46,300 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,510 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.68,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,300 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,510గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,600గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.