Chandrababu On Ysrcp Govt : వైసీపీ అధికారంలోకి వచ్చాక 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. శుక్రవారం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మూడేళ్ల పాలనలోనే ఏపీని వల్లకాడు చేశారని విమర్శించారు. ప్రజలు తమ బాధలు చెప్పుకునే వీలులేకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వారి బాధలు చెప్పుకునేందుకు వీలులేకుండా వారి నోళ్లను నొక్కి పెట్టారన్నారు. దీంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, చాలా మంది హత్యలకు గురయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని, నాలుగు వేలకు పైగా గ్రామస్థాయి నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. నలుగురు మాజీ మంత్రులను, ఆరుగురు నేతలను తప్పుడు కేసుల్లో అరెస్టులు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మరో 60 మంది టీడీపీ నేతలను కేసుల పేరుతో వేధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
క్విట్ జగన్ సేవ్ ఏపీ ఎగ్జిబిషన్
వైసీపీ నేతల అవినీతి, అకృత్యాలకు మూడేళ్లలో చాలా మంది చనిపోయారని చంద్రబాబు అన్నారు. క్విట్ జగన్ సేవ్ ఏపీ ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ను చంద్రబాబు ప్రారంభించారు. ప్రజాచైతన్యం కోసమే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల పాలనతో ఎంతో మంది టీడీపీ నేతలను వేధించారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2,552 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. అలాగే 422 మంది నిరుద్యోగులు మరణించారన్నారు. 291 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆత్మహత్యలు చేసుకున్నారని, 230 మంది నాటుసారాతో మరణించారని, 218 మంది మహిళలు వేధింపులతో ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు.
అమలాపురం అల్లర్లు అందుకే?
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చంద్రబాబు ఆరోపించారు. డీజీపీ మారినా పరిస్థితుల్లో మార్పురాలేదన్నారు. పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు. ఇప్పటికే ప్రజల్లో పోలీసు వ్యవస్థ చులకనైందని చంద్రబాబు విమర్శించారు. మూడేళ్ల పాలనలో 24 మంది బీసీ నేతల్ని హతమార్చారన్నారు. పల్నాడులో వరుస హత్యలు జరుగుతున్నా పోలీసులకు పట్టదా అని ఆయన నిలదీశారు. నేరస్థులకు వెనుకేసుకోస్తున్న పోలీసులు సిగ్గుపడాలన్నారు. తప్పు చేసిన పోలీసులకు శిక్ష తప్పదన్న చంద్రబాబు వారంతా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యా్న్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పోలీసులు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తే తప్ప ఎమ్మెల్సీని అరెస్టు చేయలేదన్నారు. అనంతబాబు చేసిన హత్య నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అమలాపురంలో అల్లర్లు సృష్టించారని ఆరోపించారు.
ఒక్కొక్కరు చనిపోతున్నారు?
మాజీ మంత్రి వివేకా హత్య కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరు చనిపోతున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ కేసు విచారణ చేస్తున్న సీబీఐకే సమర్ధత లేకపోతే దేశాన్ని ఎవరు కాపాడతారన్నారు. శ్రీనివాసరెడ్డి, గంగాధరరెడ్డి మరణాల మిస్టరీ ఏమిటని ప్రశ్నించారు. వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్లని చంపేస్తారని ముందు నుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. ఈ విషయంలో తాము చెప్పినట్లే జరుగుతుందని చంద్రబాబు అన్నారు. వారంతా కరుడుగట్టిన నేరగాళ్లని, పరిటాల రవి విషయంలో ఇలాగే చేశారన్నారు. జగన్ అవినీతిపై సీబీఐ ఛార్జ్‌షీట్ వేసినా ఏంచేయలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు.