Telangana News : ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో శిక్షపడిన భానుకిరణ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. కింద కోర్టు ఇచ్చిన యావజీవశిక్ష ను సవాల్ చేస్తూ భానుకిరణ్ హై కోర్టులో పిటిషన్ వేశారు. భాను కిరణ్ పిటిషన్ ను కొట్టివేస్తూ యావజీవ కారాగార అమలు చేసేలా కింది కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. ఇక భానుకిరణ్ కు సుప్రీంకోర్టుకు వెళ్లడమే మిగిలింది.
2018 డిసెంబర్‌లో యావజ్జీవ శిక్ష విధించిన నాంపల్లి కోర్టు
మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్యకేసులో నాంపల్లి కోర్టు 2018 డిసెంబర్‌లో తుది తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది. మరో నిందితుడు మన్మోహన్ సింగ్‌కు ఐదేళ్ల సాధారణ జైలు శిక్షను విధించింది. మరో నలుగురు నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఆయుధాల చట్టం కింద మన్మోహన్‌కు అదనంగా ఐదేళ్ల శిక్ష ఖరారు చేసింది. సూరిని హత్య చేసినప్పటి నుండి భానుకిరణ్ జైల్లోనే ఉన్నాడు.
2011 జనవరి 4న సూరిని హత్య చేసిన భానుకిరణ్
టీడీపీ నేత పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితునిగా ఉన్న మద్దెలచెరువు సూరి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కొంత మంది అనుచరులతో కలిసి సెటిల్మెంట్లు చేస్తూ ఉండేవారు. బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండేవారు. ఆయన ప్రధాన అనుచరునిగా భానుకిరణ్ అనే వ్యక్తి వ్యవహరించేవారు. ఓ విషయంపై లాయర్ తో మాట్లాడేందుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో 2011 జనవరి 4న త యూసుఫ్‌గూడ ప్రాంతంలో నాటు తుపాకీతో మద్దెలచెర్వు సూరిని కాల్చి చంపాడు. ముందు సీటులో కూర్చున్న సూరిని.. వెనుక సీటులో కూర్చున్న భానుకిరణ్ కాల్చి చంపారు. తర్వాత పరారయ్యాడు. 2012 ఏప్రిల్ వరకూ ఎవరికీ దొరకకుండా పరారీలో ఉన్నాడు. మధ్య ప్రదేశ్ తో పాటు వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నారు. చివరికి 2012 ఏప్రిల్ 21v జహీరాబాద్ వద్ద భానుకిరణ్‌ను అరెస్ట్ చేశారు.
సూరి బినామీగా పేరు
మద్దెలచెర్వు సూరి సెటిల్మెంట్లు చేసి సంపాదిచిన సొమ్మును భానుకిరణ్ పేరు మీద బినామీగా ఉంచారన్న ప్రచారం జరిగింది. అందుకే పోలీసులకు చిక్కిన తర్వాత భానుకిరణ్ హత్య చేస్తారన్న భయంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించలేదు. చాలా కాలం పాటు బెయిల్ కోసం ప్రయత్నించలేదు. పరిస్థితులు సద్దుమణిగాయనుకున్న తర్వాత ఆయన ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ లోపు యావజ్జీవ శిక్ష పడింది. బయటకు వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ఇక చివరి ఆప్షన్ గా సుప్రీంకోర్టులో ప్రయత్నించడమే మిగిలింది.