Madanapalle YSRCP :  మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో  ఫైళ్లు తగలబెట్టిన వ్యవహారం అక్కడి వైసీపీ నేతలకు పెను సమస్యగా మారింది. ఉద్దేశపూర్వకంగా ఫైళ్లు తగులబెట్టారని దీని వెనుక పెద్ద దందా ఉందని సీఐడీ అధికారులు గుర్తించారు. రెవిన్యూ అధికారులు కూడా అక్కడే ఉండి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. కొన్ని  వందల మంది వచ్చి ఫిర్యాదులు చేయడంతో.. మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని అధికారులు డిసైడయ్యారు. 


రైస్ మిల్లు మాధవరెడ్డి దొరికితే కీలక విషయాలు వెలుగులోకి               


ముందుగా ఫైళ్లను తగులబెట్టిన అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రైస్‌మిల్లు మాధవరెడ్డి అనే నేతపై అనుమానం రావడంతో వారింట్లో సోదాలు చేశారు. కొన్ని కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత అధికారుల కాల్ లిస్టులో మాధవరరెడ్డి పేరు ఎక్కువగా ఉండటంతో ఆయనను ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే విషయం తెలిసి మాధవరెడ్డి పరారయ్యారు. ఆయన ఢిల్లీలో కొంత మంది  సంరక్షణలో ఉన్నట్లుగా ప్రచారం  జరుగుతోంది. 


సీఐడీ అదుపులో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి                                       


ఇక  మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లోనూ సోదాలు చేశారు. బాబ్ ఖాన్ అనే మరో వైసీపీ నేత ఇంట్లో సోదాలు చేయడానికి వెళ్లిన సమయంలో ఆయన ఇంటి తాళాలు వేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యుల సాయంతో ఆయన కూడా తప్పించుకుని వెళ్లిపోయారు. వీరే కాదు.. పోలీసులు అరెస్టు చేస్తారని.. తమ ఇళ్లలోనూ సోదాలు చేస్తారన్న భయంతో చాలా మంది  వైసీపీ నేతలు మదనపల్లి నుంచి వెళ్లిపోయారు. ఫోన్లు కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. 


మదనపల్లిలో వందల సంఖ్యలో  భూ దందాల బాధితులు                                             


వైసీపీ హయాంలో మదనపల్లిలో పెద్ద ఎత్తున భూదందాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. అసైన్డ్ ల్యాండ్స్ ను లబ్దిదారుల నుంచి బెదిరించి లాక్కున్నారని.. వాటిని ఫ్రీహోల్డ్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకే బాధితుల కోసం ప్రత్యేకంగా అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. రెండు రోజుల  పాటు కొన్ని వందల మంది భూబాధితులు దరఖాస్తులు స్వీకరించారు. తమ భూములు లాక్కున్నారని వారంతా ఫిర్యాదులు చేశారు. వాటిపై విచారణకు ప్రత్యేకమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. 


భూములకు సంబంధించిన లావాదేవీలను తెలియకుండా చేయడానికే  వాటికి సంబంధించిన ఫైల్స్ ను తగులబెట్టారని ప్రాథమికంగా నిర్ణయించడంతో.. అసలు ఆ ఫైల్స్.. లావాదేవీలు...భూమార్పిడి వ్యవహారాలను వెలుగులోకి తేవాలని ప్రత్యేక బృందం ప్రయత్నాలు చేస్తోంది.