Another MP resigns from YCP :   మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన రెండు, మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ ను కలిసి జనసేనలో చేరే అవకాశం ఉంది. బాలశౌలి సీఎం జగన్ కు సన్నిహితుడు. వ్యాపార భాగస్వామిగా ప్రచారం ఉంది.  వైఎస్ హయాంలోనూ ఆయన ఓ సారి ఎంపీగా ఉన్నారు. స్థానికేతుడు అయినప్పటికీ మచిలీపట్నం సీటు ఇచ్చి ఎంపీగా గెలిపించారు. ఇటీవల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో  విందు ఇచ్చారు. ఈ విందుకు వెళ్లిన వారిలో  బాలశౌరి ఉన్నారు.                                   


తనకు చెప్పకుండా ఎందుకు వెళ్లారని  జగన్ ఎంపీలపై మండిపడ్డారు. ఆ బాలశౌరిపై ఇంకా ఎక్కువగా మండిపడ్డారని చెబుతున్నారు. తర్వాత మచిలీపట్నం  టిక్కెట్ కోసం ఇతరుల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పాలని అనుకున్నారు. పవన్ కల్యాణ్ ను ఇప్పటికే  రహస్యంగా కలిశారని అంటున్నారు. శుక్రవారం సాయంత్రం పవన్ తో భేటీ జరిగిందని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.


గుంటూరుకు చెందిన బాలశౌరి మచిలీపట్నం నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే మచిలీపట్నంలో మంత్రిగా మూడేళ్ల పాటు ఉన్న మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో ఆయనకు సరిపడలేదు. ఇరువురి అనుచరులు పలుమార్లు గొడవలు పడ్డారు.  ఈ వ్యవహారం హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లింది. లోకల్ లీడర్ అయిన పేర్ని నానికే హైకమాండ్ సపోర్టు చేసింది. బాలశౌరి విషయంలో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన భావిస్తున్నారు. బందర్ పోర్టు విషయంలో ఎంపీగా ఉన్న తన అభిప్రాయాలను ఏ మాత్రం జగన్ పట్టించుకోలేదని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. 


మచిలీపట్నం వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం బాలశౌరి పేరును జగన్ అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. అక్కడ ఇతర నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే బాలశౌరికి మరో చోట చాన్స్ ఇచ్చే ఆలోచన కూడా చేయడం లేదు. ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. చివరికి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు పిలిపించి ఇలా టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని కూడా చెప్పలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారని అంటున్నారు.  పవన్ కల్యాణ్‌తో గత పరిచయం ఉండటంతో ఆయన జనసేనతో టచ్ లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.                        


శుక్రవారం జనసేన ఆఫీసులో జరిగిన సమావేశంలో  బాలశౌరి పార్టీలో చేరేందుకు పవన్ అంగీకరించారని చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీపై మాత్రం జనసేన వర్గాు స్పందించడం లేదు. ప్రస్తుతానికి బాలశౌరి ఎవరికీ అందుబాటులో  లేరు.  ఈ అంశంపై ఆయన రేపో మాపో స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.