Macherla Tension : పల్నాడు జిల్లా మాచర్లలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురు నేతల ఇప్పటికే గృహనిర్బంధం చేశారు. శుక్రవారం రాత్రి టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేతల ఇళ్లపై అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డాయి. టీడీపీ నేత బ్రహ్మారెడ్డి ఇంటితో సహా పార్టీ ఆఫీసుకు నిప్పుపెట్టారు. మాచర్లలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  మాచర్ల పట్టణంలో 144 సెక్షన్‌ కొనసాగిస్తున్నారు. భారీగా పోలీసులను మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి మాచర్లలో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.  






టీడీపీ నేతల గృహనిర్బంధాలు


మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు..మాచర్ల వెళ్లేందుకు సిద్దమైన ఆనందబాబును అడ్డుకున్నారు. నక్కా ఆనందబాబు  వాహనం ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డగించి హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు మాచర్లలో దాడులను నిరసిస్తూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించేందుకు టీడీపీ శ్రేణులు ‘చలో నరసరావుపేట’ కు పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పల్నాడు ప్రాంతంలోని  టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. దీంతో పలుచోట్ల పోలీసులు, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, వినుకొండలో జీవీ ఆంజేయులును పోలీసులు గృహనిర్బంధం చేశారు. అయితే నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర పోలీసులు వలయాన్ని ఛేదించుకుని నరసరావుపేటకు కారులో బయల్దేరి వెళ్లారు. పోలీసులు వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


ఫ్యాక్షన్ లీడర్ల పనే -ఎస్పీ 


పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య ఘర్షణకు ఫ్యాక్షన్ లీడర్లే కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై మాట్లాడిన పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి... ఫ్యాక్షషన్‌ నేర చరిత్ర ఉన్న వ్యక్తుల రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. వెల్దుర్తికి సంబంధించిన ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మాచర్ల పట్టణంలో తిరుగుతున్నారని తమకు సమాచారం అందిందన్నారు రవిశంకర్‌రెడ్డి. ముందస్తు చర్యల్లో భాగంగా ఉదయం నుంచే అక్కడ తనిఖీలు చేపట్టామన్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఇదేమి ఖర్మ రా కార్యక్రమంలో వాళ్లంతా పాల్గొన్నారని వివరించారు. రాష్ట్రానికి ఇదేమి ఖర్మ రా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఫ్యాక్షన్ నేరచరిత్ర కలిగిన వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా ప్రత్యర్థులను రెచ్చగొట్టారని వాళ్లపై రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారన్నారు. పూర్తిగా ఫ్యాక్షన్ కు  సంబంధించిన గొడవకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తూ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. గత 20 నుంచి 30 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్షన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయని.. దాడులకు పాల్పడిన వాళ్లందర్నీ అదుపులోకి తీసుకుంటున్నామన్నారురవిశంకర్‌రెడ్డి. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని వివరించారు. మాచర్ల సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.