Lunar Eclipse 2022: చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలను మూసివేయబోతున్నట్లు ఆయా ఆలయాల అర్చకులు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయకు ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మూసివేయబోతున్నారు. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయడంతో మాడా వీధులు, క్యూ లైన్లు బస్టాండులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఈరోజు ఉదయం 8:30 గంటలు నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పుణ్యా వచనం, ఆలయ శుద్ధి అనంతరం రేపు ఉదయం 4:30 గంటలకి గోపూజ, స్వామికి  అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు ఉదయం 8 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం అవుతుంది అని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షకులు కోదండపాణి టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయాన్ని మూసి వేసిన అధికారులు..


చంద్రగ్రహణం కారణంగా దాదాపు 11 గంటల పాటు శ్రీవారి ఆలయంను మూసి వేయనున్నారు టీటీడీ అధికారులు. మంగళవారం ఉదయం 8:41 గంటలకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ తలుపులను మూసి వేశారు. నేటి మధ్యాహ్నం 2:39 గంటల నుండి సాయంత్రం 6:27 గంటల వరకూ చంద్రగ్రహణం గ్రహణం ఉంటుంది. దీంతో 11 గంటల ముందే అంటే ఉదయం 8:41 గంటలకే శ్రీవారి ఆలయాన్ని మూసి వేశారు. తిరిగి రాత్రి 7:30 గంటలకు శ్రీవారి ఆలయంను తెరిచి ఆలయ శుద్ది చేపట్టిన అనంతరం పుణ్య వచనం చేసి రాత్రి కైంకర్యాలను నిర్వహిస్తారు.  సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి వద్ద పంచాంగ శ్రవణం నిర్వహించిన పిమ్మట సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించనుంది టిటిడి.






ఇక చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయంలో నవంబరు 8వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీప అలంకరణ సేవలు రద్దు చేసింది. ఇక గ్ర‌హ‌ణం స‌మ‌యంలో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇత‌ర ప్రాంతాల్లో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ తాత్కాలికంగా నిలిపి వేసింది‌ టీటీడీ. ఈ విష‌యాల‌ను గుర్తించి భ‌క్తులు టీటీడీ సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.


నంద్యాల జిల్లా శ్రీశైలం...


నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆళయంలో చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. వేకువ జామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ముందుగా మంగళ వాయిద్యాలు, 3.30గంటలకు నుండి సుప్రభాతసేవ, 4.30గంటలకు శ్రీస్వామి అమ్మవార్ల మహా మంగళ హారతులు నిర్వహించారు. మహా మంగళ హారతి సమయం నుండే భక్తులను సర్వదర్శనానికి అనుమతించడం జరిగింది. తదుపరి ఉదయం 6.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసి వేశారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచిన తరువాత ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు చేస్తారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. అయితే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది. గ్రహణం కారణంగా అన్ని ఆర్జితసేవలు, శాశ్వతసేవలు, పరోక్షసేవలు నిలుపుదల చేశారు. గ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేస్తున్నారు. రాత్రి 8గంటల నుంచి అల్పాహారం అందిస్తారు.