Andhra Pradesh Rains News Updates | అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని సోమవారం (ఆగస్టు 25న) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తాజాగా ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు అల్పపీడనం ఏర్పడుతున్న క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వార్నింగ్
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. భారీవర్షాల సమయంలో చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద తలదాచుకోవడం గానీ, నిల్చోవడం చేయవద్దని ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగిపొర్లే వాగులు, కాలువలు, నీటి ప్రవాహాలను, వరద నీటిని దాటే ప్రయత్నం చేయరాదని అధికారులు హెచ్చరించారు.
ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన
ఐఎండీ అంచనా ప్రకారం నేడు (సోమవారం) ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మంగళవారం (ఆగస్టు 26న) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల వరద ఉధృతి క్రమంగా తగ్గుతున్నట్లు APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. గోదావరి, కృష్ణా నదులలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గేవరకు నదీ పరీవాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచించిన తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.