ఏపీ పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి ( Mekapati Gowtam Reddy ) దుబాయ్ ఎక్స్‌పోలో ( Dubai Expo ) ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేసి పెట్టుబడుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేసుకుని అందర్నీ ఆహ్వానిస్తూ ఏపీ ప్లస్ పాయింట్స్‌ను ప్రజెంట్ చేస్తున్నారు . ఇలా ఏర్పాటు చేసిన ఓ మీటింగ్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దుబాయ్‌లో ఏపీ సీఎం జగన్ ( CM Jagan ) గురించి పెద్దగా ఎవరికీ తెలియదని ప్రసంగించారు. గౌతం రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


టీడీపీ నేత నారా లోకేష్ ( Nara Lokesh ) ఈ అంశంపై ట్వీట్ చేశారు.  గౌతం రెడ్డి ప్రసంగిస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. ఆ సమావేశం జరిగిన హాల్లో చాలా వరకూ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని చెబుతూ.. ఖాళీ కుర్చీలకు ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి అబుదాబి వరకూ వెళ్లాలా మేకపాటి గౌతమ్ రెడ్డి గారూ అంటూ ఎద్దేవా చేశారు. పైగా మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పీచ్‌కే హైలెట్ అని లోకేష్ విమర్శలు చేశారు. చెత్త పాలన, బెదిరింపుల దెబ్బకి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న కంపెనీలు మీ ఘనత గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని.. అందుకే ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని విమర్శించారు. 


 






కొత్త కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీకెలాగో చేతకాదు.. కనీసం ఉన్న కంపెనీలు పోకుండా చూడండి అదే పదివేలు అంటూ లోకేష్ హితవు పలికారు.  దుబాయ్ ఎక్స్‌పోలో ఏపీకి ( AP ) పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించారమని ఏపీ బృందం ప్రకటించింది. మూడువేల కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు సంస్థలతో ఎంవోయూలు కూడా కుదుర్చుకున్నట్లు మీడియాకు తెలిపారు.  ఇంకా పలు కంపనీలు ఏపీలో పెట్టబడులకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.