Nara Lokesh On Redbook: రెడ్ బుక్ పేరు చెప్పగానే వైసిపి నాయకులు బెంబేలెత్తుతున్నారు, ఇప్పటికే ఒకరికి గుండెపోటు వచ్చింది, మరొకరు బాత్రూమ్ లో పడి చేయి విరిగిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. చట్టాలు ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్ వర్తిస్తుందని స్పష్టంచేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నిరుపేద కుటుంబానికి శాశ్వత పట్టా అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పాదయాత్ర హామీలు అమలు
కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 35వేలమంది ప్రజలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పొట్టచేతబట్టుకొని వలసలు వెళ్లారు. యువగళం పాదయాత్ర సమయంలో అక్కడ వలసలను నివారిస్తానని హామీ ఇచ్చా. ఆ మాటమేరకు కనిగిరిలో తొలి రిలయన్స్ సిబిజి ప్లాంటు ఏర్పాటుచేశాం. అక్కడ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 50వేల ఎకరాల భూములు ఇచ్చేందుకు తమ రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దానిపై రిలయన్స్ డైరక్టర్ స్పందించి 50 ప్లాంట్లు అక్కడే ఏర్పాటుచేస్తామని అన్నారు. కరువు ప్రాంతంలో పెద్దఎత్తున యువతకు ఉపాధి కల్పించేందుకు ఇటువంటి ప్రాజెక్టులు తెస్తుంటే వైసిపి వారికి కడుపుమంట దేనికని లోకేష్ ప్రశ్నించారు. బొబ్బలు వస్తాయంటూ దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ర్పచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే అటువంటి వారిని రెడ్ బుక్ లోకి ఎక్కిస్తానని చెప్పానన్నారు.
జగన్ కు సొంతవాళ్లను కలిసేందుకే తీరికలేదు
సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేని వారు మాకు చెబుతారా అని లోకేష్ ప్రశ్నించారు. ప్రిజనరీ ఆలోచనలన్నీ జైలువైపే ఉంటాయి. తప్పుచేశారు కనుక ఆయన ధైర్యంగా ప్రజల్లో తిరగలేకపోతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరినీ కలవలేదు, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తరువాత కూడా కనీసం కార్యకర్తలను కలిసే సమయం జగన్ కు లేదు. ప్రజలను కలిసే ఓపిక ఆయనకు ఎక్కుడుందని ప్రశ్నించారు. మాతో అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడలేక కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో మా ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు చేస్తోంది. తప్పుచేసిన వారు ఎవరైనా వదిలే ప్రసక్తిలేదు. విజనరీ లీడర్ కు – ప్రిజనరీకి ఎంతో తేడా ఉంది. ప్రపంచంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా మనబిడ్డలను సిద్ధం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 1994లో చంద్రబాబు తొలిసారి సిఎం అయినప్పుడు కొందరు ప్రత్యర్థులు కంప్యూటర్లు అన్నం పెడతాయా అంటూ అవహేళన చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఐటి ఎన్నిలక్షలమంది యువత ఉద్యోగాలు చేస్తున్నారో కళ్లముందు కన్పిస్తోందన్నారు. నిరుపేదలను పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తేవాలన్న లక్ష్యంతో పి4 విధానానికి రూపకల్పన చేసి, ఇటీవల ప్రారంభించారని గుర్తుచేశారు.
నిరుపేద కుటుంబానికి శాశ్వతపట్టా
ఉండవల్లి రజకుల కాలనీలోని కొండవాలు ప్రాంతంలో రాజమండ్రి గోవిందు కుటుంబం గత పదిహేనేళ్లుగా ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తోంది. అది కొండ పోరంబోకు కావడంతో ఇప్పటివరకు ఆ ఇంటిపై వారికి ఎటువంటి అధికారిక హక్కులు లేవు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గురువారం గోవిందు ఇంటికి వెళ్లి బట్టలు పెట్టి మరీ శాశ్వత ఇంటి పట్టాను అందజేశారు. దీంతో గోవిందు కుటుంబం ఆనందంతో పొంగిపోయింది. తాము దుగ్గిరాల నుంచి ఇక్కడకు వచ్చి 2008లో ఇల్లు నిర్మించుకున్నామని గోవిందు, ఆయన భార్య సీతామహాలక్ష్మి తెలిపారు. ఇల్లు నిర్మించుకున్న తర్వాత పట్టా కోసం గత పదిహేనేళ్లుగా తమ సంఘ పెద్దలతోపాటు తాము ఎన్నోసార్లు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదుృన్నారు. కూలీనాలి చేసి మీరు అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నారు. మీ పట్టాల కోసం నేను కేబినెట్ వరకు పోరాడి సాధించాను. దేవుడు కూడా సహకరించాడు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే తరహాలో నివసిస్తున్న పేదలకు మంగళగిరిలో మేం చేసిన మోడల్ ఉపయోగపడుతుందని లోకేష్ భరోసా ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారమే పేదలకు పట్టాభిషేకం!
ఎన్ డిఎ అధికారంలోకి వచ్చాక దశాబ్ధాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి ఉచితంగా శాశ్వత పట్టాలు అందించాలని నిర్ణయించామన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అటవీ, దేవాదాయ, రైల్వే, ఇరిగేషన్ భూముల్లో స్థానిక ప్రజలు దశాబ్ధాలుగా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. వీరిని వేరే ప్రాంతాలకు పంపితే అక్కడకు వెళ్లి ఇల్లు నిర్మించుకోవడం ఎంతో వ్యయప్రయాసలతో కూడిన పని. వారి కష్టాలు చూశాకే అధికారంలోకి వచ్చాక బట్టలు పెట్టి మరీ శాశ్వత పట్టాలు ఇస్తానని చెప్పాను.ఆ హామీని అమలు చేస్తామన్నరాు. 50వేల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరా. నన్ను గెలిపిస్తే చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెస్తానని చెప్పా. మంగళగిరి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 3వ అతి పెద్ద మెజారిటీ 91వేలతో నన్ను గెలిపించారు. ఈ ఘనవిజయంతో నాలో కసి, బాధ్యత పెరిగిందన్నారు. స్థానిక సంస్థల నిధులు, సిఎస్ ఆర్ ఫండ్స్ తో గత పదినెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో 50 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకోసం చిత్తశుద్ధితో బాధ్యతగా పనిచేస్తున్నామన్నారు.
3విడతల్లో అందరికీ శాశ్వత పట్టాలు
అటవీ భూముల్లో నివసించే వారికి ఆయాశాఖలతో మాట్లాడి జాగ్రత్తగా సమస్య పరిష్కరించాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో నివసించే ప్రజలకు మూడువిడతలుగా శాశ్వత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రస్తుతం 150 గజాల్లోపు ఉంటున్న 3వేలమందికి పట్టాలు ఇస్తున్నాం. 2వవిడతలో ఎండోమెంట్స్, రైల్వే భూముల్లో నివసించేవారికి ఇస్తాం, 3వవిడత మిగిలిన వారందరికీ పట్టాల అందజేతకు చర్యలు తీసుకుంటాం. కాల్వగట్లపై నివసించే వారికి ప్రత్యామ్నాయం కోసం ఆమోదయోగ్యమైన పరిష్కరాన్ని ఆన్వేషిస్తున్నామని తెలిపారు.