Lokesh assures Anvesh : యూట్యూబర్ నా అన్వేషణ.. అన్వేష్ గురించి తెలియని  వారు తక్కువగా ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారందరికీ ఆయన బాగా పరిచయం. ప్రపంచంలోని అన్ని దేశాలను తిరుగుతూ ఉంటారు. ఆ విశేషాలను చెబుతూ అందర్నీ ఆకట్టుకుంటారు. ఎన్నికల సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగానూ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆయన తన అన్వేషణతో పాటు బెట్టింగ్ యాప్‌లపై కూడా పోరాటం చేస్తున్నారు. చాలా కాలంగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న తోటి యూట్యూబర్లపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. 

తాజాగా ఆయన గోవిందా పేరుతో  ఓ బెట్టింగ్ యాప్ ఉందని.. దానికి తమన్నా ఇంకా చాలామంది ప్రముఖులు, టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వెబ్సైట్ లలో ప్రచారం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని పవన్, లోకేష్‌లను ఓ వీడియోలో కోరారు.  

ఈ వీడియోను  లోకేష్ చూశారు. వెంటనే స్పందించారు. ఈ బెట్టింగ్ యాప్‌లపై దీర్ఘ కాల చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అందుకే యాంటి బెట్టింగ్ పాలసీ తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.  

యూట్యూబర్లు చాలా మందికి బెట్టింగ్ యాప్‌లు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి రకరకాల బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించారు. పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. తవ్వేకొద్దీ బడా బడా వ్యక్తులు ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లుగా తేలింది. అయితే చాలా మంది తాము స్కిల్ గేమ్స్ యాప్‌లకు మాత్రమే ప్రమోట్ చేశామని వాటికి సుప్రీంకోర్టు అనుమతి ఉందని ప్రకటించారు. మొదట కొంత మందిని విచారణకు పిలిచిన పోలీసులు తర్వాత ఈ బెట్టింగ్ కేసులను సిట్ కు బదిలీ చేశారు. కానీ ఆ విచారణ అంతటితో ఆగిపోయింది. ఏపీలోనూ ఇప్పుడు సమగ్రమైన యాంటీ  బెట్టింగ్ పాలసీ తెస్తామని నారా లోకేష్ హామీ ఇస్తున్నారు.