Andhra Pradesh Weather News: అమరావతి: భారత వాతావరణ శాఖ చల్లని శుభవార్త చెప్పింది. ఎండల నుంచి అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వర్ష కబురు అందించింది. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడులలో శుక్రవారం సాయంత్రం, రాత్రి వర్షం కురవనుందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఏపీలో రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉంది. దక్షిణ కోస్తాంధ్రలోనూ కొన్ని చోట్ల చినుకులు పడనున్నాయి.


అల్పపీడన ద్రోణి ప్రభావంతో గాలులు 
దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి సగటు 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కర్ణాటక నుంచి తమిళనాడు, ఏపీ వైపు వీచనున్నాయి. మరికొన్ని గంటల్లో మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోనూ కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. 






ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో శుక్రవారం నాడు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వేడి గాలులు వీచాయి. వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లోనూ భానుడి ప్రభావం అధికంగా ఉండటంతో వాతావరణ అధికారులు ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


ఉప-హిమాలయ ప్రాంతాల్లో, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో హీట్ వేవ్ ఎక్కువగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని తీర ప్రాంత జిల్లాల్లో, యానాం, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళతో పాటు కర్ణాటకలో ఎండల ప్రభావం అధికంగా ఉండనుంది. వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, ప్రజలు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు.