Butta Renuka Propertys auction : ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న  బుట్టా రేణుకకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పత్రికల్లో ఇచ్చిన ప్రకటన రాజకీయంగానూ చర్చనీయాంశమయింది.  బుట్టా రేణుక  భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మరికొన్ని ఇతర సంస్థల ఆస్తులను   మే 6న ఈ-వేలం వేయనున్నట్టు హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గురువారం ప్రకటన విడుదల చేసింది.                       

  


వ్యాపార అవసరాల నిమిత్తం కొన్నేళ్ల క్రితం వీరు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రూ.340 కోట్ల రుణం తీసుకున్నారు. కొవిడ్ సమయంలో పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా వాటిని మూసేయాల్సి వచ్చింది. ఇది బుట్టా ఇన్‌ఫ్రాతో పాటూ ఇతర సంస్థలపై ప్రభావం చూపించింది. రుణ బకాయిలు పేరుకుపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిర్ణయించింది. బకాయి చెల్లింపుల అంశం ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ పరిశీలనలో ఉన్నా ఎల్‌ఐసీ వేలం నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఇది నిబంధనలకు విరుద్ధమని బుట్టా రేణుక దంపతులు పేర్కొన్నారు. ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. 


బుట్టా దంపతులు దాదాపు రూ.360 కోట్లను రెండు రుణ ఖాతాల ద్వారా తీసుకున్నారు.  ఈ రుణానికి 2019 నవంబరు 18న బుట్టా రేణుక, బీఎస్‌ నీలకంఠకు డిమాండ్‌ నోటీసు పంపింది. ఈ ఆస్తుల రిజర్వు ధరను రూ.360 కోట్లుగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ పేర్కొంది. ఈ ఆస్తులన్నింటినీ ఏకమొత్తంలో ఈ-వేలం ద్వారా విక్రయిస్తామని పేర్కొంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనన్నారు. 2019లో పోటీ చేయని బుట్ట రేణుక...  2014 కర్నూలు నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తులు అక్షరాల...242.60 కోట్లు.                       


వ్యాపార కుటుంబ నుంచి వచ్చిన  బుట్టా రేణుకకు ఆటోమొబైల్స్‌, ఆతిథ్యరంగంలో వ్యాపారాలు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా ఆమె వద్ద విలువైన రత్నాలు పొదిగిన రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల వద్ద మరో కిలో బంగారం ఉంది. వీటివిలువే 2 కోట్లు ఉంటుంది.   బంజారాహిల్స్‌, మాదాపూర్‌లో మెరిడియన్ స్కూళ్లు ఉన్నాయి. దీనిలో ఆమె షేర్‌ విలువ 25 కోట్లు వరకు ఉంది. ఆమె కుటుంబ సభ్యుల పేరిట హైదరాబాద్‌లో కోట్ల రూపాయల విలువైన ఇళ్లు, ఇళ్లస్థలాలు ఉన్నాయి.  పంజాగుట్టలో ఓ హోటల్ ఉన్నట్లు స్వయంగా ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే ిప్పుడు ఆమె ఆస్తులు వేలం వేయడానికి ఎల్ఐసీ ప్రకటన జారీ చేయడం .. హాట్ టాపిక్  గా మారింది. ఆమె బ్యాంకుల డబ్బులు ఎగ్గొట్టారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.