Amaravati Protests : అమరావతి  రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరుకుంది. సీఎం జగన్ దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లుగా1200 రోజుల కిందట ప్రారంభించారు. అప్పుడు ఉద్యమం ప్రారంభించిన రైతులు అలుపెరగకుండా పోరాడం చేస్తూనే ఉన్నారు. 1200 రోజులైన సందర్భంగా  రైతుల దీక్ష శిబిరానికి పలువురు నేతలు తరలి వచ్చి సంఘిభావం తెలియచేస్తున్నారు. రైతుల ఉద్యమంలో న్యాయముందని.. ధర్మం వారివైపే ఉంటుందని చంద్రబాబు ట్విట్టర్‌లో తెలిపారు. 


అంతిమంగా అమరావతిదే గెలుపు : చంద్రబాబు
 
రాజధాని ప్రాంత రైతుల ఉద్యమంలో న్యాయముందని  టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ధర్మం వారివైపే ఉందని.. అమరావతే గెలుస్తుందని చెప్పారు. రాజధాని రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. రైతుల పోరాట స్ఫూర్తిని చంద్రబాబు అభినందించారు. అమరావతి ఉద్యమం వైకాపా ప్రభుత్వ ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి ముందుకు సాగుతోందన్నారు. అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతేనని ఆయన పేర్కొన్నారు.





 దోచుకోవడానికే విశాఖ రాజధాని : కన్నా 
 
ప్రస్తుత అధికార పార్టీ తప్ప అన్ని పార్టీలు అమరావతి కోరుకుంటున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు.  సీఎం జగన్ రాష్ట్ర భవిష్యత్తును కట్ట గట్టి కృష్ణాలో పారేశారని విమర్శించారు. జగన్‌కు మూడు రాజధానులు కట్టాలని లేదని...  విశాఖ వడ్డించిన విస్తరిలా ఉందని...  దోచుకోవడానికే విశాఖ రాజధాని అంటున్నారని మండిపడ్డారు. దోచుకోవడానికే విశాఖ రాజధాని అంటున్నారని ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తించారని దీన్ని..  గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో   నిరూపించారన్నారు. జగన్ సంక్షేమ కార్యక్రమం అంతా బూటకమన్నారు. ఇచ్చేది చాక్లెట్... ఎత్తుకెళ్లేది నక్లెస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ (YCP) కార్యకర్తలు నాలుగేళ్లలో అసంతృప్తితో ఇళ్లకు పరిమితం అయ్యారన్నారు. అయితే పోలీసులు మాత్రం వాళ్ళకంటే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని మండిపడ్డారు. జగన్‌‌ను రాష్ట్ర ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజు ముందుందన్నారు. మూడు రాజధానులు అన్న రోజు... చీపురు పుల్ల కూడా జగన్ అమరావతి నుంచి తీసుకెళ్లలేరని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి చెందుతుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా తెరుచుకోని జగన్ కళ్లు : పంచుమర్తి అనూరాధ


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా జగన్  కళ్ళు తెరుచుకోడం లేదని  ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ విమర్శించారు.  అమరావతి మహిళలు పాదయాత్రకు వెళితే ఈ ప్రభుత్వం టాయిలెట్‌ను తీసుకెళ్లిపోయి.. ఇబ్బందులకు గురిచేసిందన్నారు. మహిళలను అనేక ఇబ్బందులు పాలు చేయడంతో వారి రూపు కూడా మారిపోయిందన్నారు. అమరావతికి ప్రతి టీడీపీ కార్యకర్త మద్దతుగా ఉంటారని స్పష్టం చేశారు. 


రాజధాని రైతులకు పలువురు సంఘిభావం 


 రాజధాని రైతులకు వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు సంఘిభావ తెలిపారు.  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్  , మాజీ మంత్రి అది నారాయణ రెడ్డి  , కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ  ,  మందడంలోని రైతుల దీక్షా శిబిరానికి చేరుకుని రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.