Lagadapati Rajagopal : కాంగ్రెస్‌ సీనియర్లు మళ్లీ యాక్టివ్ అవుతారా ? ఉండవల్లి, హర్షకుమార్‌లతో లగడపాటి చర్చలు !

AP Congress : రాజమండ్రిలో ఉండవల్లి, హర్ష కుమార్‌లతో లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. అయితే రాజకీయ ప్రాధాన్యం లేదని ఆయన చెబుతున్నారు.

Continues below advertisement


AP Congress Politics :   ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ( Congress party )  చేరారు. ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్  ( Lagadapati Rajagopal ) రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యారు. ఆయన మాజీ ఎంపీ హర్ష కుమార్ తో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశం రాజకీయంగా కలకలం రేపుతోంది. 

Continues below advertisement

లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన  జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. ఆ మాట మేరకు  ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు. వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే ఏపీకి  వచ్చినప్పుడు మాత్రం రాజకీయ స్నేహితుల్ని కలుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆయన రాజకీయంపై చర్చ జరుగుతూ ఉంటుంది. షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసిన తర్వాత లగడపాటి రాజగోపాల్ రాజమండ్రికి రావడం ఇద్దరు సీనియర్ మాజీ ఎంపీలతో సమావేశం కావడం సహజంగానే ఆసక్తి రేపుతోంది. 
 
హర్షకుమార్ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కానీ ఆయన యాక్టివ్ గా లేరు. షర్మిలను చీఫ్‌గా చేస్తారన్న ప్రచారం తర్వాత ఆయన వ్యతిరేకంగా స్పందించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఊడిగం చేయడానికే ఏపీ కాంగ్రెస్ ఉందా అని ప్రశ్నించారు. అలాగే  ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఏ పార్టీలో లేరు. కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీలో పని చేసిన ఆయన తర్వాత సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ అధినేత జగన్ కు సానుకూలంగా మాట్లాడుతారన్న అభిప్రాయం ఉంది. అయితే ఆయన అధికారికంగా వైసీపీలో  చేరలేదు. ఆయనకు రాజ్యసభ, ఎమ్మెల్సీ లాంటి పదవులు కూడా వైసీపీ ఆఫర్ చేయలేదు. 

ఇప్పుడు హర్ష కుమార్ తో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ ను మళ్లీ కాంగ్రెస్ లో  యాక్టివ్ అయ్యేలా చూసేందుకు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఒప్పించేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. షర్మిలకు మద్దతుగా సైలెంట్ గా ఉండిపోయిన  కాంగ్రెస్ నేతల్ని లగడపాటి తెరపైకి తెస్తున్నారన్న  వాదన వినిపిస్తోంది. అయితే లగడపాటి రాజగోపాల్ మాత్రం.. అలాంటిదేమీ లేదంటున్నారు.                                  

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది లేదని చెబుతున్నారు. రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిపోయిందని.. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదని ఆయన చెబుతున్నారు. ఓ కార్యక్రమం కోసం రాజమండ్రి వచ్చానని.. ఎప్పుడు రాజమండ్రి వచ్చినా హర్ష కుమార్ ను.. ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలవడం సహజమేనని చెబుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఎప్పటిలా స్తబ్దుగా ఉండకుండా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేలా చూసేందుకు తెరవెనుక మంత్రాగంం జరుగుతున్నట్లుగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.              

Continues below advertisement
Sponsored Links by Taboola