రాప్తాడు: వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్‌ఆర్‌ చేయూత, జగనన్న చేదోడు లాంటి ఎన్నో పథకాల ద్వారా కోట్లాది రూపాయలు మహిళల బ్యాంకుల ఖాతాల్లో జమ చేశారు. కోట్ల విలువ చేసే భూములను రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది మహిళల పేరిట ఇంటి పట్టాలిచ్చారు. 22 లక్షల  ఇళ్ల నిర్మాణాలకు మంజూరు చేశారు. అన్ని విధాలుగా మహిళలకు అండగా నిలిచారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా ఆడపడుచులు తాము జగనన్నకు అండగా ఉంటామని చెబుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. 


గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆర్థిక సాయం చేశారని చెబుతున్నారు. జగనన్నే మళ్లీ మళ్లీ రావాలని అక్క చెల్లెమ్మలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  అన్నారు. బుధవారం రాప్తాడు మరియు అనంతపురం రూరల్‌ మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు. రాప్తాడు మండలంలో 691 పొదుపు మహిళా సంఘాల గ్రూపులకు 7 కోట్ల 11 లక్షల 8 వేల రూపాయలు మంజూరయ్యాయి. రాప్తాడు మండలం ఎం. బండమీద పల్లి,  మరూరు, గొందిరెడ్డిపల్లి,  బుక్కచెర్ల,  రాప్తాడు,  అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి గ్రామంలో వైఎస్‌ఆర్‌ ఆసరా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... సంక్షేమ పథకాల పేరుతో 56 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2.58 లక్షల కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ముఖ్యమంత్రి జగనన్న జమ చేశారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టడంతో  అక్కచెల్లెమ్మలు నమ్మి అప్పులు కట్టలేదు. ఆయన గెలిచిన తర్వాత పట్టించుకోకపోవడంతో చాలా సంఘాలు డిపాల్టర్లుగా మారాయి. ఆ సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకర్లు అంగీకరించలేదన్నారు.  ప్రతిపక్ష పార్టీ వాళ్లు చెప్పే పిట్టకథలు నమ్మొద్దని, అభివృద్ధి చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. గతంలో ఉన్న పాలకులు మన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని చెప్పారు. మరో నియోజకవర్గానికి పారిపోయేందుకే సిద్ధంగా ఉన్నారు. 


జగనన్న మనకు దొరికిన ఆణిముత్యం అని, దేవుడు ఇచ్చిన పెద్ద కొడుకుగా సీఎం జగన్ ను అభివర్ణించారు. మన కష్టాలు తీర్చేందుకు రాజశేఖర్‌ రెడ్డి పంపిన పెద్ద కొడుకు అని, అందుకే నియోజకవర్గంలో 10 వేల ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు.  మరో 14 వేల ఇళ్లు మంజూరు కానున్నాయని, పేద రైతులకు ఉచితంగా బోర్లు వేశాం. అందరినీ సంతోషంగా చూసుకుంటున్నాం అన్నారు. ఎన్ని జెండాలు జతకట్టినా గెలిచేది మాత్రం వైసిపి జెండానే అని ప్రజలకు తెలుసునన్నారు.. ఇలాంటి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని మళ్లీ దీవించాలని రాప్తాడు ప్రజలకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు.