Pulivendula ZPTC Election | తాడేపల్లి: ఏపీలో శాంతి భద్రతలు లేవు. ప్రజాస్వామ్యం అసలే లేదు అనడానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఘటనలే అందుకు ఉదాహరణ అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ఎలా నిర్వహిస్తారు అని ప్రశ్నించారు. వైసీపీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌ల నుంచి బయటకు పంపించి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించిన వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ముంటే ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్‌ ఫుటేజీని వైసీపీ కార్యకర్తలకు ఇచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. 15 పోలింగ్‌ బూత్‌లలో తమ పార్టీ ఏజెంట్లు లేకుండా చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ఏపీలో ఇంత అన్యాయంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు అన్నారు వైఎస్‌ జగన్‌. కేంద్ర బలగాల రక్షణలో ఈ ఉపఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

పోలింగ్ బూత్‌లు మార్చడం ఏంటి..

ఏ ఊరిలో వాళ్లు అదే ఊరిలో ఓట్లు వేస్తారు. ప్రతి ఎన్నికల్లో అదే జరుగుతుంది. కానీ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ లను మార్చారు. ఎర్రబల్లి, నల్లపురెడ్డిపల్లికి పోలింగ్ బూత్‌లు మార్చారని జగన్ ప్రదర్శించారు. ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లి ఓటు వేసి రావడం వింతగా ఉందన్నారు. ఎన్నికల్లో నెగ్గడానికి ఇక్కడి నుంచే స్కెచ్ మొదలైంది. 4 వేల ఓట్ల పరిస్థితి ఇలా ఉంది. జనాల్ని భయభ్రాంతులు చేసి ఓట్లు వేయకుండా చేశారు. కొందర్ని బెదిరించి తమకు ఓటు వేసేలా చేశారు. 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రజల భద్రత కోసం కాదు, వారిని బెదిరించడానికి పోలీసుల్ని తెచ్చారు. ఇతర జిల్లాల నుంచి మనుషుల్ని తెచ్చి పోలీసుల సమక్షంలో బూత్ కు 400 మందిని సెట్ చేశారు. 

కలెక్టర్ ముందే దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు..

పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయటి నుంచి వచ్చిన టీడీపీ నేతలు, వారి మనుషులు ఏడు, ఎనిమిది వేల మంది వచ్చారు. ఒక్కో ఓటరుకు ఒక్కో రౌడీని ఏర్పాటు చేసిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎవరైనా అంటారా. మంత్రి సవిత, ఆదినారాయణ రెడ్డి మనుషులు, టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య మనుషులు ఈ కొత్తపల్లిలో మఖాం వేశారు. బీటెక్ రవి పులివెందుల ఓటర్ కాదు. కానీ ఆయన కూడా కనంపల్లికి వచ్చి దౌర్జన్యం చేశారు. పోలింగ్ బూత్ ల నుంచి వైసీపీ ఏజెంట్లను వెళ్లగొట్టి ఎన్నికలు జరిపారు. జమ్మలమడుగులో కలెక్టర్ ముందే దొంగ ఓట్లు వేస్తున్నా పట్టించుకోలేదు.

 

రెండు బూత్ లలో రీపోలింగ్..

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రెండు కేంద్రాల్లో బుధవారం రీపోలింగ్‌ జరుగుతోంది.  3, 14 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం (ఆగస్టు 12న) ఉప ఎన్నికలు నిర్వహించారు.  నిరసనల మధ్య పోలింగ్‌ జరిగింది. ఒంటిమిట్టలో 81.53 శాతం, పులివెందులలో 76.44 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు స్థానాల్లోనూ 11 మంది అభ్యర్థుల చొప్పున పోటీ చేశారు. పులివెందులలో టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి మధ్య పోటీ నెలకొంది.